అమెరికాలో 15 లక్షలకు చేరువలో
అమెరికాలో 15 లక్షలకు చేరువలో

24 గంటల్లో 11 వేలకుపైనే నమోదు

రష్యాలోనూ కట్టలు తెంచుకున్న మహమ్మారి
 ప్రపంచ వ్యాప్తంగా 46.70 లక్షలు

దాటిన బాధితులున్యూయార్క్‌: విశ్వ మహమ్మారి కరోనా వైరస్‌ చాలా దేశాల్లో ఇంకా ఉద్ధృతంగానే వ్యాపిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో అమెరికా, రష్యాల్లో తీవ్రంగా విరుచుకుపడింది. బ్రెజిల్‌, బ్రిటన్‌, సౌదీ అరేబియా, మెక్సికో, స్పెయిన్‌ తదితర దేశాల్లోనూ అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. శనివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసులు 46.70 లక్షలు మించిపోయాయి.

అత్యధికం ఇక్కడే...
అమెరికాలో 11 వేలకుపైగా కొత్త కేసులు నమోదు కావడంతో, ప్రపంచంలోనే అత్యధికంగా ఇక్కడ మొత్తం కేసులు 15 లక్షలకు చేరువయ్యాయి. టెక్సాస్‌, జార్జియా తదితర 41 రాష్ట్రాల్లో కొవిడ్‌-19 పరీక్షలు తగినంతగా జరగడం లేదని అసోసియేటెడ్‌ ప్రెస్‌ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా పునఃప్రారంభించాలంటే రోజూ 9 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించాలని హార్వర్డ్‌ వర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు.
* రష్యాలో 9,200 కొత్త కేసులు వెలుగు చూడటంతో, శనివారం అక్కడ మొత్తం కేసుల సంఖ్య 2.72 లక్షల మార్కును దాటింది. మహమ్మారి కారణంగా ఇక్కడ 2,500కు పైగా మంది మృత్యువాత పడ్డారు.
*  సింగపూర్‌లో కొత్తగా 465 మందికి వైరస్‌ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27 వేల మార్కును దాటింది.
*  ఇటలీలోని వెనిస్‌ నగరం పర్యాటకులకు మళ్లీ ఆహ్వానం పలుకుతోంది. మిలన్‌లో సోమవారం నుంచి వేల సంఖ్యలో హోటళ్లు, బార్లు, క్షౌరశాలలు, వస్త్ర దుకాణాలు తెరచుకోనున్నాయి.
*  పాకిస్థాన్‌లో ఆంక్షలను సడలించిన క్రమంలో కరాచీ, లాహోర్‌, ఇస్లామాబాద్‌ మధ్య శనివారం దేశీయ విమాన సేవలు పాక్షికంగా ప్రారంభమయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1,581 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసులు 39 వేలకు చేరువయ్యాయి. ఇప్పటివరకూ ఈ దేశంలో 834 మంది వైరస్‌తో మృతిచెందారు.
*  చైనాలో తాజాగా 21 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది.

ఐరోపా నగరాల్లో నిరసనలు
ఐరోపాలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా... పలు నగరాల్లో శనివారం ఆందోళనలు వ్యక్తమయ్యాయి. లండన్‌లోని హైడ్‌ పార్క్‌ వద్ద నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. పోలండ్‌లో ఆందోళన చేపడుతున్నవారిపై పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.

Tags :

మరిన్ని