25 వేల మందికి చిరాగ్ ఫౌండేషన్‌ చేయూత
25 వేల మందికి చిరాగ్ ఫౌండేషన్‌ చేయూత

హైదరాబాద్‌: కొవిడ్‌-19 మహమ్మారి వల్ల వలస కార్మికులు, నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేద్దామంటే పని దొరక్క, ఆహారం లభించక దుర్భర జీవితం గడుపుతున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు, వలస కూలీలు, అనాథ శరణాలయాల్లో ఉండేవారు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారి ఆకలిని తీర్చేందుకు చిరాగ్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 25 వేల మందికి నిత్యావసరాలు, ఆహారం అందజేసినట్లు ఆ ఫౌండేషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

తెలుగురాష్ట్రాల్లోని మురికివాడలు, షెల్టర్లు, గ్రామాలతో పాటు నల్లమల అడవుల్లోని చెంచు తెగకు చెందిన వారికి సాయం చేసినట్లు తెలిపింది. దీంతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని వలస కూలీలకు, కోల్‌కతాలోని మురికివాడలు, అసోంలోని మారుమూల గ్రామాల్లో తాము సహాయం అందజేసినట్లు పేర్కొంది. దాతలు అందించిన 60 వేల డాలర్ల మొత్తంతో ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపింది. కాలిఫోర్నియా వేదికగా నడుస్తున్న ఈ ఫౌండేషన్‌ ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టింది. నిరుపేద చిన్నారులకు విద్య, లైబ్రరీల ఏర్పాటు, ట్రైసైకిళ్ల పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహించింది.

Tags :

మరిన్ని