అమెరికాలో పోలీస్‌ కర్కశం
అమెరికాలో పోలీస్‌ కర్కశం

ఆఫ్రికన్‌ అమెరికన్‌ వ్యక్తి మెడను మోకాలితో తొక్కిపెట్టిన అధికారి

ఊపిరాడడంలేదన్నా వినకుండా దాష్టీకం

ఆస్పత్రికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే మృతి

మినియాపొలిస్‌: మానవత్వానికే మచ్చ తెచ్చే సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పోలీసుల అమానుష తీరు కారణంగా ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఒక ఆఫ్రికన్‌అమెరికన్‌ వ్యక్తి మెడపై పోలీసు ఒకరు మోకాలితో తొక్కిపెట్టడంతో ఊపిరాడక గిజగిజలాడిపోయి చివరకు మరణించాడు. ‘దయచేసి నా గొంతుపై కాలు తీయండి.. ఊపిరి ఆడట్లేదు. ప్రాణం పోయేలా ఉంది. నన్ను చంపేసేలా ఉన్నారు’ అని విలవిలలాడిపోతూ, అతను వెలిబుచ్చిన ఆవేదన ఆ పోలీసు అధికారి ముందు అరణ్య రోదన అయింది. అమెరికాలోని మినియాపొలిస్‌లో సోమవారం రాత్రి  ఈ దుర్మార్గం చోటుచేసుకుంది.

అక్కడే ఉన్న ఓ వ్యక్తి చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఓ ఫోర్జరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సోమవారం రాత్రి జార్జ్‌ ఫ్లాయిడ్‌ (46) అనే ఆఫ్రికన్‌ అమెరికన్‌ కనిపించాడు. కారు నుంచి వెలుపలికి రావాల్సిందిగా ఆదేశించారు. బయటకు రాగానే జార్జ్‌ను నేలపైకి పడగొట్టారు. సంకెళ్లు వేశారు. ఈ క్రమంలో జార్జ్‌ మెడపై పోలీసు అధికారి ఒకరు మోకాలు బలంగా ఆనించాడు. ‘అతను ఊపిరి తీసుకోలేకపోతున్నాడు’ అని పక్కనే ఉన్న ఓ వ్యక్తి గట్టిగా అరిచినా పోలీసులు ఏమాత్రం లెక్కచేయలేదు ఆ తర్వాత జార్జ్‌లో క్రమక్రమంగా చలనం ఆగిపోయింది. అయినప్పటికీ పోలీసు అధికారిలో ఏమాత్రం కనికరం కనిపించలేదు. వైద్య సంరక్షణ సిబ్బంది స్ట్రెచర్‌ తెచ్చేవరకు మోకాలు తీయలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే జార్జ్‌ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన నలుగురు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించారు.

Tags :

మరిన్ని