న్యాయం జరిగితేనే శాంతి
న్యాయం జరిగితేనే శాంతి

అమెరికాలో కొనసాగుతున్న నిరసనలు
న్యూయార్క్‌లో ఉద్విగ్నభరితంగా ఫ్లాయిడ్‌ సంస్మరణ సభ

వాషింగ్టన్‌: పోలీసు అధికారి కర్కశానికి ఆఫ్రికన్‌-అమెరికన్‌ జాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ బలైన ఉదంతంపై... అగ్రరాజ్యంలో ఎగిసిన నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. న్యూయార్క్‌, వాషింగ్టన్‌, షికాగో, లాస్‌ ఏంజెలెస్‌లో తాజాగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ‘‘న్యాయం జరగకుంటే శాంతి ఉండదు’’ అని ఆందోళనకారులు నినదించడంతోపాటు ‘‘8.46’’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. గతనెల 25న ఫ్లాయిడ్‌ మెడపై పోలీసు అధికారి మోకాలితో 8.46 నిమిషాలపాటు బలంగా అదిమి అతని మృతికి కారణమైన సంగతి తెలిసిందే.
మినియాపోలిస్‌ నగరంలో గురువారం రాత్రి ఫ్లాయిడ్‌ సంస్మరణ కార్యక్రమం ఉద్విగ్నభరితంగా సాగింది. రెవరెండ్‌ షార్ప్‌టన్‌ మాట్లాడుతూ- ‘‘ఫ్లాయిడ్‌ కథ నల్లజాతీయులందరిది. 401 సంవత్సరాలుగా... మన కలలన్నీ మోకాళ్ల కింద నలిగిపోతున్నాయి. మనం ఊపిరి పీల్చలేకపోతున్నాం. మా మెడల పైనుంచి మీ మోకాళ్లను తీసేయండని చెప్పాల్సిన తరుణం వచ్చింది’’ అని అన్నారు. పోలీసు, న్యాయ వ్యవస్థల్లో తక్షణం సంస్కరణలు తీసుకురావాలంటూ వారంతా గొంతెత్తారు. నార్త్‌ కరోలినాలోని రీఫోర్డ్‌కు ఫ్లాయిడ్‌ శవపేటిక శనివారం చేరనుంది. అక్కడ జరిగే జ్ఞాపకార్థ ప్రార్థనల్లో కుటుంబ సభ్యులు పాల్గొంటారు. ‘‘ఫ్లాయిడ్‌ కుటుంబానికి మరోసారి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. ఇలాంటి సంక్లిష్ట సమయం నుంచి బయటపడి శాంతి నెలకొనాలని ఆశిస్తున్నా’’ అని ప్రథమ మహిళ మెలనియా ట్రంప్‌ పేర్కొన్నారు.

అధ్యక్షుడిపై వ్యాజ్యం..
గతవారం వాషింగ్టన్‌లో ఆందోళనకారులపై బాష్పవాయువును ప్రయోగించడాన్ని ఆక్షేపిస్తూ... అమెరికా పౌర హక్కుల సమాఖ్య, మరికొన్ని సంస్థలు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు అటార్నీ జనరల్‌ విలియం బార్‌ తదితర ఉన్నతాధికారులపై కొలంబియా డిస్ట్రిక్ట్‌ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాయి.

ట్రంప్‌ సందేశాన్ని తొలగించిన ట్విటర్‌

ఫ్లాయిడ్‌కు నివాళిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన తాజా ట్వీట్‌ను ట్విటర్‌ తొలగించింది. ఫ్లాయిడ్‌కు సంబంధించిన దృశ్యాలు, తన సందేశంతో కూడిన వీడియోను ట్రంప్‌ పోస్ట్‌ చేశారు. అందులోని దృశ్యాల కాపీరైట్‌ తనవేనంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ట్వీట్‌ను తొలగించినట్లు ట్విటర్‌ పేర్కొంది.

Tags :

మరిన్ని