పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడి మృతి
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడి మృతి

అట్లాంటాలో మరోసారి ఎగిసిపడ్డ నిరసనలు

అట్లాంటా: అమెరికాలో పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు మృతిచెందాడు. దీంతో అట్లాంటాలో భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ నగర పోలీసు చీఫ్‌ వెంటనే రాజీనామా చేయాల్సి వచ్చింది. జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి వ్యతిరేకంగా అగ్రరాజ్యంలో వెల్లువెత్తిన నిరసనలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

పోలీసుల అధికారిక నివేదిక ప్రకారం..‘‘రెషార్డ్‌ బ్రూక్‌(27) అనే వ్యక్తి అట్లాంటాలోని వెండీ రెస్టారెంటు ముందు శుక్రవారం రాత్రి తన కారును నిలిపి అందులోనే నిద్రపోయాడు. దీంతో ఇతర కస్టమర్లకు అసౌకర్యం కలిగిస్తున్నాడంటూ రెస్టారెంట్‌ యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. అక్కడికి చేరుకున్న వారు.. అతడు మత్తులో ఉన్నట్లు గుర్తించారు. అరెస్టు చేయడానికి ప్రయత్నించగా ప్రతిఘటించాడు. పోలీసుల చేతిలోని ఓ తుపాకిని లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు. వెంబడించగా.. వెనక్కి తిరిగి కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు బ్రూక్‌ను ఆపేందుకు కాళ్లపై కాల్పులు జరిపారు’’ అని నివేదికలో పేర్కొన్నారు. ఈ ఘటనంతా అక్కడున్న నిఘా కెమెరాల్లో రికార్డు అయిందని.. దాని ఆధారంగానే రిపోర్టు తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. కానీ, కొద్దిసేపటికే పరిస్థితి విషమించడంతో బ్రూక్‌ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసుల వాదనపై అతని కుటుంబ సభ్యులు ఇంకా స్పందించాల్సి ఉంది. 

ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే నిరసనకారుల భారీ ఎత్తున రోడ్లపైకి చేరుకున్నారు. ఘటన జరిగిన రెస్టారెంటుకు సమీపంలోని కార్లకు నిప్పింటించారు. దీనిపై స్పందించిన నగర మేయర్‌ కేషా లాన్స్ బాటమ్స్‌.. కాల్పులు జరిపిన పోలీసుని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. అలాగే ఘటనకు బాధ్యత వహిస్తూ నగర పోలీస్‌ చీఫ్‌ ఎరికా షీల్డ్స్‌ రాజీనామా చేసినట్లు ప్రకటించారు.



మరిన్ని