పనిమంతులపై ఆంక్షలు
పనిమంతులపై ఆంక్షలు

అమెరికా వలస విధానంలో మార్పులు

వేరే దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్ళినవారు ఆ దేశ పౌరసత్వం పొందడానికి అయిదు మార్గాలు ఉన్నాయి. వలస, జాతీయతా చట్టం (ఐఎన్‌ఏ)లో అమెరికా కాంగ్రెస్‌ నిర్దేశించిన నిబంధనలు వర్తించేవారు (నాచురలైజేషన్‌); గ్రీన్‌ కార్డు కలిగినవారు; కుటుంబ వలస, దత్తత, శరణార్థిగా గుర్తింపు ఉన్నవారు- అమెరికన్‌ పౌరసత్వం పొందడానికి అర్హులు. ఈ శాశ్వత పౌరసత్వ హోదా అటుంచితే తాత్కాలికంగా పని పర్మిట్‌పై వచ్చేవారికి వలసేతర వీసాలు ఇస్తారు. హెచ్‌ 1 బి, హెచ్‌ 2బి, ‘జె’, ‘ఎల్‌’ వీసాలు తాత్కాలిక వీసాల కిందకు వస్తాయి. అమెరికా ఆర్థిక, విద్యా, సాంస్కృతిక రంగాల్లో స్వల్పకాలం పనిచేయడానికి వచ్చేవారికి ఈ తాత్కాలిక వీసాలు లభిస్తాయి. ప్రస్తుతం కొన్ని మినహాయింపులతో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం నిషేధించినది ఈ వలసేతర తాత్కాలిక వీసాలనే. ఈ తరహా వీసాదారులు ఈ ఏడాది జూన్‌ 24 నుంచి డిసెంబరు 31 వరకు అమెరికాలో అడుగు పెట్టడానికి వీల్లేదు.
హెచ్‌ 1బి పూర్వాపరాలు
విశ్వవిద్యాలయ పట్టాలున్న విదేశీ నిపుణులను కొన్ని ప్రత్యేక వృత్తి ఉద్యోగాల్లో తాత్కాలికంగా నియమించుకోవడానికి అమెరికన్‌ కంపెనీలను అనుమతిస్తూ, 1990 అమెరికా వలస చట్టం కింద హెచ్‌ 1బి వీసాను ప్రవేశపెట్టారు. మూడు నుంచి ఆరేళ్ల వరకు ఈ వీసాలు అమలులో ఉంటాయి. అమెరికన్‌ కంపెనీలు, యజమానులు తాత్కాలిక పనుల నిమిత్తం నియమించుకునే వ్యవసాయేతర కార్మికులకు ఆరు నెలల నుంచి ఏడాది కాలావధికి హెచ్‌ 2 బి వీసాను ఇస్తారు. భారత్‌ తప్ప 81 దేశాల కార్మికులకు వీటిని మంజూరు చేస్తారు. విద్యాసాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అమెరికాకు వచ్చే వ్యక్తులకు ‘జె’ వీసాలు ఇస్తారు. ఆ కార్యక్రమాలు ముగియగానే వారు అమెరికా విడిచి వెళ్లిపోవాలి. అమెరికా వెలుపల ఉన్న కంపెనీలు కొన్ని ప్రత్యేక, తాత్కాలిక పనుల నిమిత్తం అమెరికాకు పంపే ఉద్యోగులకు ‘ఎల్‌’ వీసాలు మంజూరవుతాయి. కొత్తగా గ్రీన్‌ కార్డులు మంజూరై తమతమ దేశాలకు వెళ్లినవారు, 60 రోజులపాటు అమెరికాలో తిరిగి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ గత ఏప్రిల్‌ 22న ట్రంప్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే. కొవిడ్‌ వల్ల కోట్ల సంఖ్యలో అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారనే కారణంపై ఆయన ఈ చర్య తీసుకున్నారు. నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసేవరకు వలసేతర వీసాలపై నిషేధం కొనసాగుతుంది. తెల్లజాతి అమెరికన్ల ఓట్లు కొల్లగొట్టడానికి ట్రంప్‌ ఈ ఎత్తు వేశారని ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తాయి. వలస వ్యతిరేక విధానాన్ని ట్రంప్‌ ఇప్పటికిప్పుడు తలకెత్తుకోలేదు. మూడేళ్లుగా ఆ పని మీదే ఉన్నారు. మొదట ఆఫ్రికాలోని కొన్ని ముస్లిం మెజారిటీ దేశాల నుంచి అమెరికాకు ఎవరూ రాకూడదంటూ ప్రయాణాలపై నిషేధం విధించారు. ఈ ఏడాది ఫిబ్రవరి-ఏప్రిల్‌ మధ్య కాలంలో దాదాపు రెండు కోట్లమంది అమెరికా పౌరులు ఉద్యోగాలు కోల్పోయారు. సాధారణంగా హెచ్‌ 1బి, ‘ఎల్‌’ తరగతుల వీసాదారులను నియమించుకునే పరిశ్రమలు, కంపెనీల్లో ఈ ఉద్యోగ నష్టం సంభవించింది. ఇక హెచ్‌ 2బి వీసాదారులు పనిచేసే రంగాల్లో 1.7 కోట్లమంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. ఇంతా చేసి ఈ రెండు రకాల వీసాలను నిలిపేసినా అమెరికన్లకు దక్కే ఉద్యోగాలు 5,25,000కు మించవు. ‘అమెరికన్లు మన ఆర్థిక వ్యవస్థలోని ప్రతిరంగంలో విదేశీయుల నుంచి పోటీ ఎదుర్కోవలసి వస్తోంది. తాత్కాలిక పనుల కోసం అక్రమంగా సరిహద్దు దాటి వచ్చే లక్షలాది విదేశీయులూ మనవాళ్లకు పోటీ వస్తున్నారు. ఈ తాత్కాలిక కార్మికుల్లో చాలామంది భార్యాపిల్లలతో తరలివస్తున్నారు. ఈ కుటుంబ సభ్యుల వల్ల కూడా ఉద్యోగ విపణిలో అమెరికన్లకు పోటీ ఎదురవుతోంది’ అంటూ ట్రంప్‌ వలసలపై విరుచుకుపడ్డారు. తద్వారా అమెరికన్‌ ఓటర్లను ఆకట్టుకోవాలని ఆశిస్తున్నారు.

కొన్ని మినహాయింపులు
ఆహార సరఫరా గొలుసులో హెచ్‌ 2బి వీసాతో పనిచేస్తున్నవారికి ట్రంప్‌ నిషేధాజ్ఞల నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే రక్షణ రంగం, శాంతిభద్రతల నిర్వహణ, దౌత్యం, కొవిడ్‌ చికిత్సలో నిమగ్నమైన ఆరోగ్య కార్యకర్తలు, అమెరికా ఆర్థికంగా త్వరితగతిన కోలుకోవడానికి కీలకమైన పనుల్లో ఉన్నవారు జాతీయ భద్రత కోణంలో మినహాయింపు పొందుతారు. ఇలాంటివారిలో హెచ్‌ 1బి, ‘ఎల్‌’ వీసాదారులు ఉంటారు. అమెరికా ఏటా 85,000 హెచ్‌ 1బి వీసాలు మంజూరు చేస్తుంది. వీటిలో మూడింట రెండు వంతులు భారతీయులకు, అందులోనూ ‘టెక్‌ వర్కర్ల’కు లభిస్తున్నాయి. నేడు అమెరికాలో 30 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉంటే, వారిలో 7,50,000 మంది హెచ్‌ 1బి వీసాదారులే. హెచ్‌ 1బి వీసాలను అధికంగా పొందిన భారతీయ కంపెనీలు- టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, హెచ్‌.సి.ఎల్‌, లార్సెన్‌ అండ్‌ టూబ్రో ఇన్ఫోటెక్‌. 2017 వరకు అమెరికాలో పెట్టుబడి పెట్టిన 100 భారతీయ కంపెనీల్లో ఈ ఐటీ కంపెనీలూ ఉన్నాయి. భారతీయ కంపెనీలు అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో 1790 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టి అమెరికన్లకు 1,13,000 ఉద్యోగాలు కల్పించాయి. భారతీయ కంపెనీలకు ఉన్నట్టుండి హెచ్‌ 1బి వీసాలను నిలిపేయడం వల్ల అమెరికాలో టెక్నాలజీ, అకౌంటింగ్‌, పారిశ్రామికోత్పత్తి రంగాలపై ప్రతికూల ప్రభావం ప్రసరిస్తుంది. కొవిడ్‌ కలిగించిన అపార నష్టం నుంచి అమెరికా శీఘ్రంగా కోలుకోవడానికి తోడ్పడే రంగాలివే. వలసేతర వీసాలను స్తంభింపజేయాలని ట్రంప్‌ సర్కారు నిర్ణయించడం, భారత్‌-అమెరికా ఆర్థిక సహకారాన్ని బలహీనపరచడమే కాదు, రెండు దేశాల వ్యూహత్మక భాగస్వామ్యానికీ నష్టం కలిగిస్తుంది.

- అశోక్‌ ముఖర్జీ
(రచయిత- ఐక్యరాజ్యసమితిలో భారత్‌ తరఫున మాజీ ప్రతినిధి)

Tags :

మరిన్ని