భారతీయ అమెరికన్ల ఆందోళన.. ఎందుకంటే?
భారతీయ అమెరికన్ల ఆందోళన.. ఎందుకంటే?

దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం పడిందన్న భారతీయ అమెరికన్లు

ముంబయి: అమెరికాలోని  ప్రతి ఐదు భారతీయ అమెరికన్లలో ఇద్దరు తమ దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వం గురించి ఆందోళన చెందుతున్నారు. అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ ప్రభావమే ఇందుకు కారణం. ఈ వైరస్‌ దెబ్బకు దాదాపు ప్రతి ఎన్‌ఆర్‌ఐ జీవనశైలి మారిపోయిందని తెలిసింది.

భారతీయ అమెరికన్‌ సమాజంపై కొవిడ్‌-19 ప్రభావాన్ని తెలుసుకొనేందకు ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా, ఇండియన్‌ డయాస్పొరా స్టడీస్‌ (ఎఫ్‌ఐఐడీఎస్‌) నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. దాదాపు 30% భారతీయ అమెరికన్ల ఉద్యోగం, ఇంటర్న్‌షిప్స్‌పై ఆర్థిక ప్రభావం పడిందని నివేదిక వెల్లడించింది. ప్రతి ఆరుగురిలో ఒకరు లేదా కుటుంబ సభ్యుల్లో ఒక్కరికైనా కొవిడ్‌-19 పాజిటివ్‌ ఉన్నట్టు పేర్కొంది. మహమ్మారి వల్ల కొద్ది మంది భారతీయులు వలస (ఇమ్మిగ్రేషన్‌) ఇబ్బందులు చవిచూశారని తెలిపింది.

‘భారతీయ అమెరికన్లపై కొవిడ్‌-19 ప్రభావం, దానికి స్పందన ఎలాఉందో తెలుసుకొనేందుకు ఈ సర్వే చేపట్టాం’ అని ఆ సంస్థ డైరెక్టర్‌ ఖందెరావ్‌ కండ్‌ అన్నారు. ఇలాంటి సర్వే చేయడం ఇదే మొదటిసారని చెప్పారు. చాలామంది ఎన్‌ఆర్‌ఐలు సామాన్య ప్రజలకు మాస్క్‌లు, ఆహారం, వైద్య సహాయం, ఆవాసం కల్పించేందుకు కృషి చేశారని వెల్లడించారు.

ప్రతి ఆరుగురిలో ఐదుగురు భారతీయ అమెరికన్లు తమ కుటుంబ సంబంధాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయని లేదా మార్పులేమీ లేవని వెల్లడించారు. నలుగురిలో ఒకరు కుంగుబాటు, నిరాశ, నిస్సహాయత వ్యక్తం చేశారు. కొవిడ్‌-19 వల్ల ప్రతి భారతీయ అమెరికన్‌ తమ జీవన శైలిని మార్చుకోవడం గమనార్హం. ప్రపంచంలో అత్యధిక కరోనా వైరస్‌ కేసులు అమెరికాలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్‌ మొదట చైనాలో పుట్టిన సంగతి తెలిసిందే.


మరిన్ని