మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం: పొట్లూరి రవి
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం: పొట్లూరి రవి

వాషింగ్టన్‌:  ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో ఉన్న కర్నూలు జిల్లాకు చెందిన ఎన్నారైలను సమన్వయపరచడానికి కర్నూలు ఎన్నారై ఫౌండేషన్  సంస్థను ఏర్పాటు చేసినట్లు అమెరికాలోని ఫిలడెల్ఫియా లో స్థిరపడిన కర్నూలు జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు, తానా ప్రధాన కార్యదర్శి పొట్లూరి రవి తెలిపారు.  ఈ సంస్థ ద్వారా కర్నూలు జిల్లాకు చెందిన ఎన్నారైల సహకారంతో విద్య, వైద్య రంగాల్లో సేవలు అందిస్తామని, నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించే విధంగా శిక్షణ శిబిరాలు, సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. జిల్లాకు చెందిన కళాకారులు, మేధావులు, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురష్కారాలు అందజేస్తామని తెలిపారు. దాదాపు పదివేల మంది పేద మహిళలతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఓర్వకల్లు మండలం పొదుపు లక్ష్మి ఐక్య సంఘం కు చెందిన బాల భారతి పాఠశాల ద్వారా ప్రతి సంవత్సరం 100మంది అనాథ విద్యార్థులకి విద్యనందించే కార్యక్రమం చేపడుతున్నామని రవి అన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రతి సంవత్సరం రూ. పది లక్షలు అందించనున్నామని, మరిన్ని వివరాలకు kurnoolnrifoundation@gmail.com సంప్రదించాలని కోరారు. 

కరోనా మహమ్మారి వల్ల  ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లను పంచి పెట్టామని రవి అన్నారు. ‘‘తొలుత  ఏప్రిల్‍ 11న కర్నూలులో మాస్కులు పంపిణీ చేశాం.  కర్నూలు పట్టణ కమిషనర్‍ రవీంద్ర బాబు చేతుల మీదుగా కర్నూల్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍ లో ఉద్యోగులకు, పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్స్ అందించాం. జిల్లాలో పదివేలకు పైగా మాస్కులు అందించాం. కర్నూలులో శ్రీ బాలాజీ క్యాంటీన్‍ సహకారంతో లాక్‍డౌన్‍ విధించిన నాటి నుంచి కర్నూలు నగరంలోని పారిశుధ్య కార్మికులకు, నిరాశ్రయులకు, జాతీయ రహదారి మీద వెళ్తున్నవలస కార్మికులుకు ఇలా  దాదాపు 30,000 మందికి భోజనాలు అందజేశాం. తానా ఫౌండేషన్‍ సహకారంతో జిల్లాలో పెద్దఎత్తున నిత్యావసర వస్తువుల పంపిణీకి శ్రీకారం చుట్టాం. మే 18వ తేదీన కర్నూలు ఓల్డ్ సిటీలో ఉన్న దాదాపు నాలుగు వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ చేతుల మీదుగా పంపిణీ చేశాం. మే 21న పాణ్యం మండలంలోని సుగాలి మిట్ట, రాంభూపాల్‍ తండా తదితర గ్రామాల్లోని దాదాపు రెండువేల కుటుంబాలకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‍ రెడ్డి  నిత్యావసర సరుకులను అందజేశారు’’అని పొట్లూరి రవి తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

Tags :

మరిన్ని