ఆ వీసా నిబంధనలపై గూగుల్‌, ఫేస్‌బుక్‌ దావా
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆ వీసా నిబంధనలపై గూగుల్‌, ఫేస్‌బుక్‌ దావా

వాషింగ్టన్‌ : ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) తీసుకొచ్చిన కొత్త వీసా నిబంధనలపై పోరాడేందుకు అగ్రరాజ్యంలోని డజన్‌కుపైగా పెద్ద టెక్నాలజీ కంపెనీలు సిద్ధమయ్యాయి. ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని ఇటీవల ఐసీఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, ఎంఐటీ వేసిన దావాలో  టెక్‌ దిగ్గజాలైన గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌లాంటి కంపెనీలు చేరాయి.

ఐసీఈ నిబంధనలపై తాత్కాలిక నిరోధక ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఈ సంస్థలు యూఎస్‌ ఛాంబర్‌ఆఫ్‌ కామర్స్‌, ఇతర ఐటీ న్యాయవాద గ్రూపులతో కలిసి దావా వేశాయి. జులై 6 నాటి ఐసీఈ నిబంధనలు తమ నియామక ప్రణాళికలను దెబ్బతీస్తున్నాయని ఈ సంస్థలు పేర్కొన్నాయి. దీంతో అంతర్జాతీయ విద్యార్థులను తీసుకురావడం అసాధ్యమవుతుందని వెల్లడించాయి. ఈ ఆదేశాలు అంతర్జాతీయ విద్యార్థులను సీపీటీ, ఓపీటీ కార్యక్రమాల్లో పాల్గొనడం కష్టతరం చేస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశాయి. అమెరికా జీడీపీలో ఇక్కడ నివసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల భాగస్వామ్యం కూడా ఉందని పేర్కొన్నాయి.

‘‘వచ్చే విద్యా సంవత్సరానికి గానూ పూర్తి స్థాయిలో  ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు నిర్ణయించిన స్కూళ్లలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వీసా జారీచేయబోం. అలాంటి వారిని దేశంలోకి అనుమతింబోం. నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా ఎఫ్‌-1, ఎం-1పై ప్రస్తుతం అమెరికాలో ఉంటూ ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నవారు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. చట్టబద్ధంగా ఉండాలనుకుంటే భౌతికంగా తరగతులకు హాజరయ్యేందుకు అనుమతిస్తున్న విద్యా సంస్థలకు బదిలీ చేసుకోవాలి’’ అని ఐసీఈ ఈ నెల 6న విడుదల చేసిన తన ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.


మరిన్ని