ప్లాస్మా కావాలా?
ప్లాస్మా కావాలా?

ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేసిన ఎన్నారై

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: మనిషికి మనిషి తోడుగా ఉండాల్సిన తరుణమిది. కరోనా నుంచి కోలుకున్నాం.. హమ్మయ్య అనుకోకుండా.. ఇతరులను ఆ మహమ్మారి నుంచి బయటపడే అవకాశం ఇద్దాం అన్న ఆలోచన రావాలి. ప్లాస్మా దానంతో కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొందాం అనే నినాదంతో ముందుకొచ్చింది ఓ ఫేస్‌బుక్‌ గ్రూప్‌. నగరానికి చెందిన ఎన్నారై సంతోశ్‌ ఏర్పాటు చేసిన ‘కొవిడ్‌ 19 ప్లాస్మా డోనర్‌- రిసీపెంట్‌ హెల్ప్‌ ఇండియా గ్రూప్‌’.. ప్లాస్మా దాతల వివరాలను కొవిడ్‌ బాధితులకు అందించే వేదికగా ఉపయోగపడుతోంది. కేవలం హైదరాబాదే కాదు.. దేశంలోని ప్రధాన నగరాలకు సంబంధించిన వాలంటీర్లు ఈ గ్రూప్‌ వేదికగా పని చేస్తున్నారు.

మరొకరికి ప్రాణ దానం.. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న రోగులు త్వరగా కోలుకునేందుకు ప్లాస్మా థెరపీ తప్పనిసరిగా మారింది. వ్యాక్సిన్‌ లేకపోవడంతో వైద్యులు ఈ పద్ధతిని పాటిస్తున్నారు.ప్లాస్మా థెరపీతో కొవిడ్‌ రోగుల శరీరంలో వైరస్‌తో పోరాడే ప్రతిరక్షకాలు తయారవుతాయి. తద్వారా వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

ఎలా మొదలైందంటే... అమెరికాలో కరోనా విజృంభణ.. అక్కడే ఉద్యోగం చేస్తున్న సంతోశ్‌ మనసును కలచివేసింది. ప్లాస్మా థెరపీతో కరోనా రోగులు కోలుకుంటున్నారని తెలుసుకుని దాతల సమాచారం సేకరించే పనిలో పడ్డాడు. ఈ నేపథ్యంలోనే సంతోష్‌, రజిని ప్రియ, అఖిల్‌ ఎన్నంశెట్టి కలిసి ‘కొవిడ్‌ 19 ప్లాస్మా డోనర్‌- రిసీపెంట్‌ హెల్ప్‌ ఇండియా గ్రూప్‌’ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సుమారు 300 మంది కరోనా నుంచి కోలుకున్న వారి ద్వారా ప్లాస్మా దానం చేయించారు. దిల్లీలో అత్యధికంగా 190 మంది ప్లాస్మాదానం చేశారు. హైదరాబాద్‌లో సుమారు 40 మంది ప్లాస్మా దానం చేయించే ఏర్పాట్లు చేశారు. ఈ గ్రూప్‌లో ఇప్పటికే 3000 మంది వాలంటీర్లుగా చేరారు.

Tags :

మరిన్ని