కరోనా లేకుంటే.. వ్యవస్థాగత క్వారంటైన్‌ మినహాయింపు 
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కరోనా లేకుంటే.. వ్యవస్థాగత క్వారంటైన్‌ మినహాయింపు 

విదేశాల నుంచి వచ్చేవారికి ఊరట 
నూతన మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం 
ఈ నెల 8 నుంచి అమల్లోకి.

విదేశాల నుంచి భారత్‌కు వచ్చేవారికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం కాస్త సడలించింది. కరోనా సోకలేదని ధ్రువీకరించేలా వ్యాధి నిర్ధారణ పరీక్ష రిపోర్టును సమర్పించేవారికి వ్యవస్థాగత (ఇన్‌స్టిట్యూషనల్‌) క్వారంటైన్‌ నుంచి మినహాయింపునిచ్చింది. ఈ నెల 8 నుంచి ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుందని తెలిపింది. భారత్‌కు ప్రయాణం ప్రారంభించడానికి 96 గంటల్లోపు చేసుకున్న పరీక్షకు సంబంధించిన రిపోర్టునే ప్రయాణికులు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. తప్పుడు నివేదికలు సమర్పిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విదేశాల నుంచి వచ్చేవారికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ మేరకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కుటుంబ సభ్యులు చనిపోవడం, తీవ్ర అనారోగ్యం, గర్భం, పదేళ్లలోపు కుమారులు/కుమార్తెలు ఉండటం వంటి తప్పనిసరి కారణాలతో భారత్‌కు వచ్చేవారు ఇకపై 14 రోజుల హోం క్వారంటైన్‌ను ఎంచుకోవచ్చునని కూడా అందులో పేర్కొంది. ఇందుకోసం భారత్‌కు ప్రయాణం ప్రారంభించడానికి కనీసం 72 గంటల ముందు ఆన్‌లైన్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇన్నాళ్లూ వారు తొలుత ఏడు రోజులు సొంత ఖర్చులతో వ్యవస్థాగత క్వారంటైన్‌లో ఉండి, ఆపై ఏడు రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చేది. 

మరిన్ని మార్గదర్శకాలివీ.. 

విమానాలు, నౌకల ద్వారా భారత్‌కు వచ్చేవారంతా తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 

థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాత.. కరోనా లక్షణాలేవీ లేనివారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. 

కొవిడ్‌ లేదని రిపోర్టు సమర్పించినవారు, తప్పనిసరి పరిస్థితుల్లో భారత్‌కు వస్తున్నవారు కాకుండా మిగతా వారంతా 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటామంటూ స్వీయ అంగీకార పత్రం సమర్పించాలి. ఇందులో ఏడు రోజులు సొంత ఖర్చుపై వ్యవస్థాగత క్వారంటైన్‌లో ఉండాలి. తర్వాతి ఏడు *రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. 

రోడ్డు మార్గాల్లో వచ్చేవారికి కూడా ఇవే మార్గదర్శకాలు వర్తిస్తాయి. 

వ్యవస్థాగత క్వారంటైన్‌లో ఉన్నప్పుడు పాజిటివ్‌గా తేలితే.. వారిని ఆస్పత్రులకు తరలిస్తారు. వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉంటే హోం క్వారంటైన్‌లో ఉండేందుకు అనుమతిస్తారు.


కొవిడ్‌ రోగుల వెంట స్మార్ట్‌ఫోన్లు

అనుమతివ్వాలని కేంద్రం లేఖ

దిల్లీ: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వ్యాధిగ్రస్థులు తమ వెంట స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. వీటి సాయంతో వారు వీడియో సమావేశాల రూపంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడుగలుగుతారని, తద్వారా మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొందగలుగుతారని తెలిపింది. ఈ మేరకు వైద్య సేవల డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ గర్గ్‌ రాష్ట్రాల వైద్యశాఖల కార్యదర్శులకు లేఖలు రాశారు. ఆరోగ్య పరిస్థితితో పాటు రోగుల మానసిక పరిస్థితి కూడా గమనించేలా వైద్యులకు సూచనలు చేయాలని తెలిపారు. స్మార్ట్‌ ఫోన్లను తీసుకెళ్లడానికి కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు అనుమతి ఇవ్వకపోతుండడంతో ఆయన ఈ లేఖలు రాశారు.

నేషనల్‌ క్లినికల్‌ రిజిస్ట్రీ ఏర్పాటు

ఆసుపత్రుల్లో చేరిన కరోనా రోగుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయడానికి భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)..నేషనల్‌ క్లినికల్‌ రిజిస్ట్రీని ఏర్పాటు చేసింది. దీంతో చికిత్స విధానాలు, ఏ మందు ప్రభావం ఏ వయసు వారిపై ఎలా ఉంది? తదితర అంశాలను సూక్ష్మంగా విశ్లేషించి అధ్యయనం చేయడానికి వీలు కలుగుతుంది. కరోనా లక్షణాలు ఇంకా స్పష్టంగా వెల్లడికానందున ఇలాంటి విశ్లేషణ ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దిల్లీ ఎయిమ్స్‌ సహా దేశంలోని 15 ప్రముఖ వైద్య విద్యా సంస్థలను, వంద ఆసుపత్రులను అనుసంధానం చేస్తూ ఈ రిజిస్ట్రీని నెలకొల్పారు.

Tags :

మరిన్ని