హెచ్‌-1బీ వీసాలపై ఆంక్షలు చెల్లవు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
హెచ్‌-1బీ వీసాలపై ఆంక్షలు చెల్లవు

అమెరికా ఫెడరల్‌ కోర్టు తీర్పు

వాషింగ్టన్‌: భారతదేశ ఐటీ రంగ నిపుణులకు ఊరట కలిగించేలా గురువారం అమెరికా ఫెడరల్‌ కోర్టు ఒకటి తీర్పునిచ్చింది. ఈ ఏడాది చివరి వరకు హెచ్‌-1బీ వీసాలను మంజూరు చేయకుండా ట్రంప్‌ ప్రభుత్వం విధించిన ఆంక్షలను కొట్టివేసింది. ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా అధ్యక్షుడు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలను ఉల్లంఘించారని ఈ తీర్పును వెలువరించిన కాలిఫోర్నియా నార్త్‌ డిస్ట్రిక్ట్‌ ఫెడరల్‌ కోర్టు జడ్జి జెఫ్రీ వైట్‌ వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని ఆదుకునేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ వీసాల జారీపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. ఐటీ నిపుణులకు సంబంధించిన హెచ్‌-1బీ వీసాలతో పాటు, వ్యవసాయేతర రంగాల సీజనల్‌ కార్మికుల కోసం మంజూరు చేసే హెచ్‌-2బీ వీసాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన జె-వీసాలు, బహుళజాతి సంస్థల మేనేజర్లు, ఇతర కీలక ఉద్యోగులకు ఇచ్చే ఎల్‌-వీసాలపై ఆంక్షలు పెట్టారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పలు సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ప్రపంచవ్యాప్త పోటీని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి నిబంధనలు చేటు కలిగిస్తాయని పేర్కొన్నాయి. వీటిని విచారించిన న్యాయస్థానం.. ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చే అధికారం చట్టసభ అయిన కాంగ్రెస్‌కు తప్ప అధ్యక్షునికి లేదని తెలిపింది. అధ్యక్షుడు మహారాజులాగా వ్యవహరించకూడదని, ఈ అధికారాలపై పరిమితులు ఉండాలని పేర్కొంది.  
హెచ్‌-1బీ వీసాలు ప్రక్షాళన చేయాలని బిల్లు
హెచ్‌-1బీ వీసాల మంజూరు ప్రక్రియలో సమూలంగా మార్పులు చేయాలని కోరుతూ అలబామా కాంగ్రెస్‌ సభ్యుడు మో బ్రూక్స్‌ (రిపబ్లికన్‌ పార్టీ) గురువారం ప్రతినిధుల సభలో బిల్లు పెట్టారు. ‘అమెరికన్‌ జాబ్స్‌ ఫస్ట్‌ యాక్ట్‌’ పేరుతో ప్రవేశ పెట్టిన ఈ బిల్లులో విదేశీ ఉద్యోగులను తీసుకునే సమయంలో స్థానిక ఉద్యోగులను తొలగించకూడదని ప్రతిపాదించారు. అత్యవసరమైతే తప్ప విదేశీ ఉద్యోగులను తీసుకోకూడదని పేర్కొన్నారు. విదేశీ ఉద్యోగులను తక్కువ వేతనాలకు తీసుకోవాలన్న విధానానికి స్వస్తి పలకాలని తెలిపారు. స్థానిక ఉద్యోగులకన్నా వారికే ఎక్కువ జీతాలు చెల్లించాలని, కనీస వేతనం కింద 1,10,000 డాలర్లు (సుమారు 80 లక్షల రూపాయలు) ఉండాలని ప్రతిపాదించారు. వీసా లాటరీ విధానాన్ని, విదేశీ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించే సౌకర్యాలనూ రద్దు చేయాలని ఆ బిల్లులో పేర్కొన్నారు.

Tags :

మరిన్ని