సియాటెల్‌లో ప్రవాస భారతీయుల సమావేశం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సియాటెల్‌లో ప్రవాస భారతీయుల సమావేశం

సియాటెల్‌: వాషింగ్టన్‌ రాష్ట్రంలోని సియాటెల్‌ నగరంలో ప్రవాస భారతీయుల సమావేశం ఇటీవల జరిగింది. వర్చువల్‌ ఫండ్‌ రైజర్‌లో భాగంగా టీజీ విశ్వప్రసాద్‌, వందన ప్రసాద్‌ ఈ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి వాషింగ్టన్ రాష్ట్ర గవర్నర్ జే రాబర్ట్ ఇన్స్లీ హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో తమ ప్రభుత్వం ఎంత సమర్థంగా పనిచేస్తోందో వివరించారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 అంశం చర్చకు రాగా.. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కంటే, తమ పరిధిలో ఉన్నవారికి సేవలందించడంపై దృష్టి సారించాలని వ్యాఖ్యానించారు. ప్రతి దేశానికీ సొంత సమస్యలున్నాయని, ఎవరికి వారు తమ అంతర్గత సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్‌పై ప్రవాస భారతీయులు ప్రశంసలు గుప్పించారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వాషింగ్టన్ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రగతిశీల నాయకుడిగా ఇన్ స్లీని కొనియాడారు. వాషింగ్టన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్మాణంతో పాటు రాష్ట్రం సాంస్కృతిక గుర్తింపును సుసంపన్నం చేయడంలో గవర్నర్ పాత్రను ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే, 75 వసంతాల భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వచ్చే ఏడాది ఆగస్టులో సియాటెల్‌ ఘనంగా నిర్వహించాలని టీజీ విశ్వప్రసాద్‌ సంకల్పించారు. 20 వేల మందితో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమానికి రావాలని గవర్నర్‌ను విశ్వప్రసాద్‌ ఆహ్వానించగా సానుకూలంగా స్పందించారు. 2012లో అప్పటి గవర్నర్ క్రిస్టిన్ గ్రెగోయర్ వాణిజ్య ప్రతినిధి బృందాన్ని విశ్వప్రసాద్‌ భారత దేశానికి సమన్వయపరచారు. 2021లో భారతదేశానికి ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన గవర్నర్ ఇన్ స్లీని కోరాగా అందుకు సానుకూలంగా స్పందించారు.

Tags :

మరిన్ని