అమెరికాలో దేవరకొండ వాసి మృతి
అమెరికాలో దేవరకొండ వాసి మృతి

కారులో మంటలు చెలరేగి సజీవ దహనమైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు
 స్థానికంగా విషాదఛాయలు

దేవరకొండ, న్యూస్‌టుడే: కారులో మంటలు చెలరేగి నల్గొండ జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు అమెరికాలో సజీవ దహనమైన ఘటన స్థానికంగా విషాదానికి కారణమైంది. దేవరకొండ మండలం కర్నాటిపల్లి గ్రామానికి చెందిన నల్లమాద నర్సిరెడ్డి, భారతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు దేవేందర్‌రెడ్డి(45) పాతికేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. ప్రస్తుతం న్యూజెర్సీలో నివాసం ఉంటూ హైట్‌యాంటీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్లే క్రమంలో కారు స్టార్ట్‌ చేస్తుండగా మంటలు చెలరేగాయి. ఆయన కారులోనే సజీవ దహనమయ్యారు. బ్యాటరీ కారణంగా మంటలు వ్యాపించాయా? లేదా? చేతులకు రాసుకున్న శానిటైజర్‌ వల్ల ప్రమాదం జరిగిందా? అనే కోణంలో అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు బంధువులు వెల్లడించారు. దేవేందర్‌రెడ్డి న్యూజెర్సీలో టీఆర్‌ఎస్‌ ఎన్నారై అధికార ప్రతినిధిగానూ వ్యవహరిస్తున్నారు. మృతునికి భార్య, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న బాల్య స్నేహితులు దేవరకొండలోని ఆయన తల్లిని ఓదార్చారు. 2021 జనవరిలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించేందుకు స్వగ్రామం వస్తానని తమతో చెప్పారని, ఇంతలోనే ఇలా జరగడం బాధగా ఉందని వారు ఆవేదన వ్యక్తంచేశారు.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని