అమెరికా వెళ్లే విద్యార్థులకు ఐఏసీసీ మార్గదర్శనం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికా వెళ్లే విద్యార్థులకు ఐఏసీసీ మార్గదర్శనం

వెబినార్‌లో అవగాహన పొందిన  తెలుగు విద్యార్థులు

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌ ప్రభావం, అమెరికాలో మారిన పరిణామాల నేపథ్యంలో ఉన్నత విద్య కోసం అక్కడికి వెళ్లాలనుకునే మనదేశ యువతకు అవసరమైన సమాచారం అందించడానికి ఇండో- అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(ఐఏసీసీ) సంపూర్ణ సహకారం అందిస్తుందని సంస్థ జాతీయ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు సూరపనేని చెప్పారు. ఆ సంస్థ అమెరికన్‌ కాన్సులేట్‌, యూఎస్‌- ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌(యూఎస్‌ఐఈఎఫ్‌)తో సంయుక్తంగా అమెరికాలో ఉన్నత విద్యపై అవగాహన కల్పించేందుకు మంగళవారం వెబినార్‌ నిర్వహించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన 1800 మందికి పైగా విద్యార్థులు పాల్గొని అవగాహన పొందారు. వెబినార్‌లో పూర్ణచంద్రరావు మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ విద్య కోసం అమెరికా వెళ్లేవారు అక్కడ ఉపాధి అవకాశాలను పొందేందుకు కూడా తమ సంస్థ సహకరిస్తుందన్నారు. ఐఏసీసీ తెలుగు రాష్ట్రాల ఛైర్మన్‌ విజయసాయి మేకా మాట్లాడుతూ ఐటీ సంబంధిత విద్యకు ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. సంస్థ ఉపాధ్యక్షుడు రాంకుమార్‌ రుద్రభట్ల మాట్లాడుతూ 2019లో అమెరికాకు ఉన్నత విద్య కోసం వెళ్లిన వారిలో 41 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేనని తెలిపారు. మరో ఉపాధ్యక్షుడు సి.నారాయణరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు అమెరికన్‌ కాన్సులేట్‌, హైదరాబాద్‌తో కలిసి ప్రతి మూణ్నెల్లకు వెబినార్లు నిర్వహిస్తామన్నారు. యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ వైస్‌ కాన్సుల్‌ జొహన్నా మాట్లాడుతూ వీసా పొందే సమయంలో దరఖాస్తుదారులు నమ్మకమైన, అర్హత పొందిన విద్యార్థులమని కాన్సుల్‌ అధికారిని ఒప్పించడం తప్పనిసరన్నారు.

Tags :

మరిన్ని