15 రోజులుగా ప్రవాసాంధ్రుడి నిరశన
15 రోజులుగా ప్రవాసాంధ్రుడి నిరశన

అమరావతి కోసం అమెరికాలో దీక్ష చేపట్టిన లోకేశ్‌బాబు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్‌తో అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో ప్రవాసాంధ్రుడు, వైద్యుడు ఉయ్యూరు లోకేశ్‌బాబు చేస్తున్న నిరాహార దీక్ష శనివారం పదిహేనో రోజుకి చేరింది. అమెరికాలో ఉదరకోశ వ్యాధుల నిపుణుడిగా పనిచేస్తున్న ఆయన ఈ నెల 13న నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రస్తుతం చాలా నీరసంగా, నిస్సత్తువగా ఉన్నా, ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆమరణ నిరాహార దీక్షను విరమించదలుచుకోలేదని తెలిపారు. ‘పోలవరం ప్రాజెక్టు నాశనానికి మోదీ, జగన్‌రెడ్డి తెర తీశారు. అమరావతి రైతులు... పోలవరం నిర్వాసితులు, రాయలసీమ, ఆంధ్ర ప్రాంత రైతులు, విశాఖ ఉక్కు పరిరక్షణకు కృషి చేస్తున్న వారితో కలసి ఉద్యమించాలి. ఆంధ్రప్రదేశ్‌ని వల్లకాడు చేస్తున్న వారిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించండి’ అని ఆ ప్రకటనలో కోరారు. తెలుగు ప్రజలకు అండగా ఉండాలన్న లక్ష్యంతోనే దీక్ష ప్రారంభించానని, అమరావతి ఉద్యమ పంథా మారాలని కోరుకుంటున్న సగటు ప్రవాస భారతీయుడినని తెలిపారు.

Tags :

మరిన్ని