ఓసీఐ కార్డుదారులకు ఊరట
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఓసీఐ కార్డుదారులకు ఊరట

 ఇకపై భారత్‌కు వచ్చేటప్పుడు పాత పాస్‌పోర్ట్‌లు అక్కర్లేదు

వాషింగ్టన్, న్యూయార్క్‌: అమెరికాలో ఉంటున్న భారత సంతతి ప్రజలు, ప్రవాస భారతీయ పౌరుల (ఓసీఐ) కార్డు కలిగినవారు ఇకపై భారత్‌కు వచ్చే సమయంలో తమ పాత, రద్దైన పాస్‌పోర్ట్‌లను వెంట తేవాల్సిన అవసరం లేదని అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం ప్రకటించింది. కొత్తగా ఓసీఐ కార్డు పొందడానికి, పాతవి పునరుద్ధరించుకోవడానికి గల గడువును ఈ ఏడాది డిసెంబర్‌ 31వరకు పొడిగించినట్లు ఈ నెల 26న విడుదలచేసిన ప్రకటనలో వెల్లడించింది. ‘‘ఓసీఐ కార్డుపై భారత్‌కు వచ్చేవారు ఇకపై పాత పాస్‌పోర్ట్‌లను తేవాల్సిన అసవరం లేదు. అదే సమయంలో కొత్త పాస్‌పోర్ట్‌ను మాత్రం తప్పనిసరిగా తేవాల్సి ఉంటుంది’’ అని స్పష్టంచేసింది. 

 ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న భారత సంతతి ప్రజలకు ఓసీఐ కార్డులను జారీచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్డులు ఉన్నవారు వీసా లేకుండానే భారత్‌కు రావొచ్చు. భారతీయులకు ఉన్న అన్నిరకాల ప్రయోజనాలను దాదాపుగా పొందొచ్చు. అదే సమయంలో ఓటు వేయడానికి, ప్రభుత్వ సేవలు పొందడానికి, భారత్‌లో వ్యవసాయ భూమిని కొనుగోలుచేయడానికి మాత్రం వీలుండదు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఓసీఐ నిబంధనల ప్రకారం 20 ఏళ్లలోపు వారు లేదా 50 ఏళ్లు దాటిన వారు కొత్త పాస్‌పోర్ట్‌ పొందిన ప్రతిసారి తమ ఓసీఐ కార్డును పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో గతేడాది ఈ నిబంధనలను సరళీకరించింది. పాస్‌పోర్ట్‌లను తెచ్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం మాత్రం ఇదే తొలిసారి.   

Tags :

మరిన్ని