ఘనంగా ప్రపంచ మహిళ తెలుగు కవితా మహోత్సవం
ఘనంగా ప్రపంచ మహిళ తెలుగు కవితా మహోత్సవం

సింగపూర్‌: అంతర్జాలం ద్వారా ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రపంచ మహిళా తెలుగు కవితా మహోత్సవం నిర్వహించినట్లు డాక్టర్‌ వంశీ రామరాజు అన్నారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి వంశీ విజ్ఞాన పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, సాహితీ కిరణం మాసపత్రిక సంయుక్తంగా మూడు రోజుల పాటు ఈ మహోత్సవాన్ని నిర్వహించారు. 17 దేశాల నుంచి 250మంది కవయిత్రులతో అద్వితీయంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య నిర్వాహకులు డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ.. మహిళా కవయిత్రులకు ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారు తమ ప్రయత్నానికి ప్రత్యేక అభినందనలు తెలిపారని వివరించారు. తమ ప్రయత్నానికి మరింత తృప్తిని ఇస్తూ ఈ కార్యక్రమం ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ వారు గుర్తించారని సంతోషం వ్యక్తం చేశారు.

అంతర్జాలం వేదికగా జరిగిన ఈ  కార్యక్రమంలో మొదటిరోజు భువనచంద్ర, డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి; రెండో రోజు డాక్టర్ నందిని సిధారెడ్డి, డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి; మూడో రోజు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, మామిడి హరికృష్ణ, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, ‘సాహితీ కిరణం’ మాసపత్రిక సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, వివిధ దేశాలలోని తెలుగు సంస్థల అధ్యక్షులు పలు ప్రముఖ రచయిత్రులు పాల్గొన్నారు.

రాధికా మంగిపూడి సింగపూర్, జుర్రు చెన్నయ్య హైదరాబాద్,  జయ పీసపాటి హాంకాంగ్, రాధిక నోరి అమెరికా, కార్యక్రమ వ్యాఖ్యాతలుగా వ్యవహరించి ఆసక్తికరంగా ముందుకు నడిపించారు. భారత్, అమెరికా, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూకే, ఖతార్ సహా 17 దేశాల నుంచి ఆయా ప్రాంతాలలో పేరుపొందిన 250 మంది రచయిత్రులు తమ కవితలను ఈ వేదికపై పంచుకున్నారు. ఉగాది కవితలు, చందోబద్ధ రచనలు, సామాజిక స్పృహ ఉండే అంశాలు మొదలైన వివిధ కోణాల నుండి వైవిధ్యభరితమైన అంశాలను ఎన్నుకొని అందంగా మలచిన కవితలతో కవయిత్రులందరూ రాణించడం విశేషంగా ఆకర్షించింది.

Tags :

మరిన్ని