పురిటిగడ్డపై తెలుగు వైద్యుల ఔదార్యం
పురిటిగడ్డపై తెలుగు వైద్యుల ఔదార్యం

కరోనా రోగులకు ఆపన్న హస్తం
లక్ష డాలర్లు సేకరించిన ‘గాంధీ’ పూర్వ విద్యార్థులు
తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రులకు పరికరాల వితరణ
ఈనాడు - హైదరాబాద్‌

‘ఏ దేశ మేగినా.. ఎందు కాలిడినా.. నిలపరా నీ జాతి నిండు గౌరవము..’ అన్నారు రాయప్రోలు సుబ్బారావు. తెలుగుగడ్డపై చదువుకుని విదేశాల్లో పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఎంతోమంది తెలుగు వైద్యులు ఆపదలో ఉన్న పురిటిగడ్డను ఆదుకోడానికి ముందుకొస్తున్నారు. కొవిడ్‌ మహమ్మారి గడగడలాడిస్తున్న ప్రస్తుత తరుణంలో వారు అవసరమైన వైద్య పరికరాలతోపాటు టెలీమెడిసిన్‌ ద్వారా సేవలు అందిస్తున్నారు. అమెరికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో స్థిరపడ్డ గాంధీ వైద్యకళాశాల పూర్వ విద్యార్థులు బృందంగా ఏర్పడి లక్ష డాలర్లు సేకరించారు. దీనికి నార్త్‌కరోలినాలోని డాక్టర్‌ రేణుక అనంత్‌ కల్యాణ్‌ నేతృత్వం వహించారు. వెంకట్ బొడవుల, రాజశేఖర్‌ కొల్లిపర, ఆదిత్యరెడ్డి, సుమితి సురవరం, హేమంత సుంకర, రోహిణిరెడ్డి వంగ, సమత మాధవరపు, పావని అడపా, అరుణ్‌ రాఘవ్‌, కె.మహేష్‌కుమార్‌, లోహిత్‌రెడ్డి తదితరులంతా తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను ఎంపిక చేసుకుని ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, సీపాప్‌, బైపాప్‌ యంత్రాలు, వైద్య సిబ్బంది కోసం ఎన్‌95 మాస్క్‌లు, పీపీఈ కిట్లు.. ఇలా అన్ని రకాల సామగ్రిని యుద్ధప్రాతిపదికన ఇక్కడకు తరలించారు.

నిలిచిన ప్రాణాలు..
పూర్వ విద్యార్థుల వితరణతో గాంధీ ఆసుపత్రికి సమకూరిన 150 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, సీపాప్‌లు, బైపాప్‌లు ఎంతోమంది రోగుల ప్రాణాలు కాపాడాయని కొవిడ్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఏప్రిల్‌ రెండు, మూడో వారాల్లో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉండడంతో ఐసీయూలు, ఆక్సిజన్‌ పడకలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. నిత్యం 200 మంది వరకు క్లిష్ట పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చేవారు. చాలామందికి ఆక్సిజన్‌ లేదా ఐసీయూ పడక అవసరయ్యేది. కొందరికి 2-3 గంటలపాటు అత్యవసర విభాగం వద్ద నిరీక్షణ తప్పేది కాదు. ఇలాంటి సమయంలో పూర్వ విద్యార్థులు అందించిన ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల కారణంగా 200 ఆక్సిజన్‌ పడకలు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా పరికరాలు అందించడంతో రోగులకు ఎంతో ఉపయోగపడ్డాయని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. భారత్‌లోని ఓ సంస్థతో గాంధీ పూర్వ విద్యార్థులు ఒప్పందం కుదుర్చుకుని యుద్ధప్రాతిపదికన ఈ పరికరాల సరఫరాకు ఏర్పాట్లుచేశారు. 10,000 ఎన్‌95 మాస్క్‌లు, 1500 ఫేస్‌షీల్డ్‌లు, 610 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 130 బైపాప్‌ యంత్రాలు, 485 ఆక్సిజన్‌ సిలిండర్లు, పల్స్‌ ఆక్సీమీటర్లు వితరణగా ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 131 ప్రభుత్వ ఆసుపత్రులకు వీటిని అందించారు.

రాత్రంతా మేల్కొని మాట్లాడేవాళ్లం..

కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోటానికి మా వంతు సాయం అందించాలని మా బృందం నిర్ణయించింది. అమెరికా, భారత్‌ రెండు వేర్వేరు టైం జోన్స్‌లో ఉండటం వల్ల ఇక్కడ వారితో సంప్రదింపుల కోసం కొన్నిసార్లు వేకువజాము వరకు మేల్కొని మాట్లాడే వాళ్లం. ఒకవైపు మా రోజువారీ విధులను నిర్వహిస్తూనే ఎలాగైనా ఈ వితరణ కార్యక్రమం విజయవంతం చేయాలని నిర్ణయించాం. అమెరికాలో ఉన్న తెలుగు వైద్యులంతా సహకరించారు. ఇక్కడ రోగులకు అవసరమైన సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు టెలీమెడిసిన్‌ ద్వారా అందిస్తున్నాం. మున్ముందు కూడా చేదోడు వాదోడుగా ఉంటాం.

-డాక్టర్‌ రేణుక అనంత్‌ కల్యాణ్‌, ఇంటర్నల్‌ మెడిసిన్‌, నార్త్‌ కరోలినా
Tags :

మరిన్ని