US: గ్రీన్‌కార్డు జారీపై పరిమితి ఎత్తేద్దాం!
close
US: గ్రీన్‌కార్డు జారీపై పరిమితి ఎత్తేద్దాం!

అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు
ఆమోదం లభిస్తే భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్తే!

వాషింగ్టన్‌: అమెరికాలో శాశ్వత నివాసానికి దారులు తెరిచే గ్రీన్‌కార్డు కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న భారతీయులకు, ముఖ్యంగా ఐటీ నిపుణులకు శుభవార్త! ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల జారీపై దేశాలవారీ పరిమితిని ఎత్తివేయాలంటూ అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశ పెట్టారు. ప్రస్తుత పద్ధతి ప్రకారం... ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రెంట్‌ వీసాల్లో.. ప్రతి దేశానికీ ఏడు శాతం పరిమితి ఉంది. ప్రస్తుతం ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఈక్వల్‌ యాక్సెస్‌ టు గ్రీన్‌కార్డ్స్‌ ఫర్‌ లీగల్‌ ఎంప్లాయిమెంట్‌ (ఈగల్‌) చట్టం-2021 ఈ పరిమితిని తొలగించాలని కోరుతోంది. పుట్టిన దేశం ఆధారంగా కోటాల పద్ధతిలో కాకుండా... నైపుణ్యం ఆధారంగా అమెరికాలో నివాసానికి వెసులుబాటు కల్పిస్తుంది. ఈ బిల్లు ప్రతినిధుల సభ నుంచి సెనెట్‌కు వెళుతుంది.
ప్రస్తుత పద్ధతితో ఎదురుచూపులు
ప్రస్తుత విధానంలో హెచ్‌-1బి పని వీసాలపై వచ్చి ఈ 7% పరిమితి కారణంగా గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి.  తాజా బిల్లులో ఆ పరిమితిని ఎత్తేయటంతో పాటు... కుటుంబ ప్రాయోజిత వీసాలపై ఉన్న పరిమితిని 7 నుంచి 15 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. ‘తక్కువ జనాభా ఉన్నవాటికీ, ఎక్కువ జనాభా దేశాలకూ ఒకే పరిమితి విధించారు. ఇది పూర్తిగా అర్ధరహితం. మన దేశ ఆర్థిక వ్యవస్థకిది నష్టం చేస్తుంది’ అని డెమొక్రాటిక్‌ ప్రతినిధి లోఫ్‌గ్రెన్‌ వ్యాఖ్యానించారు. ‘పుట్టిన ప్రదేశానికి కాదు. వచ్చేవారు అమెరికాకు ఎంతగా ఉపయోగపడతారనేది కీలకం. అమెరికా కంపెనీలు నిపుణులైనవారిని నియమించుకొని... మనదేశంలో మరిన్ని ఉద్యోగాలు పెంచే సేవలు, ఉత్పత్తులను సృష్టించాలి’ అని ఆమె సూచించారు. ‘‘ఇప్పుడున్న పద్ధతి ప్రకారమైతే... దాదాపు 10 లక్షల మంది భారతీయ నిపుణులు 200 సంవత్సరాలు వేచి చూసినా గ్రీన్‌కార్డు వస్తుందో రాదో తెలియని పరిస్థితి! మరోవైపు చిన్నదేశాల్లోని వారికి మాత్రం సులభంగా కార్డు లభిస్తోంది. ఇకమీదట ఆ పరిస్థితి ఉండదు’’ అని ఇమ్మిగ్రేషన్‌ వాయిస్‌ వ్యవస్థాపకులు అమన్‌ కపూర్‌ వ్యాఖ్యానించారు.



మరిన్ని