భారత్‌కు అమెరికా టీకా సాయం
భారత్‌కు అమెరికా టీకా సాయం

నెలాఖరుకల్లా వ్యాక్సిన్‌ పంచుతాం: బైడెన్‌
మోదీకి కమలా హారిస్‌ ఫోన్‌

వాషింగ్టన్‌: తన వద్ద అవసరానికంటే అధికంగా మిగిలిపోయిన 8 కోట్ల డోసుల టీకాలను ప్రపంచ దేశాలకు పంచటానికి అమెరికా ముందుకొచ్చింది. తొలి విడతగా... 2.5 కోట్ల డోసుల్లో 1.9 కోట్ల డోసులను దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలకు అందజేస్తారు. వీటిలో 60 లక్షల డోసులను లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాలకు; 70 లక్షల టీకాలను దక్షిణాసియా, ఆగ్నేయాసియాకు పంపి... ఆఫ్రికాకు 50 లక్షల డోసులు సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గురువారం ప్రకటించారు. మిగిలిన 60 లక్షల టీకాలను కొవిడ్‌ అధికంగా ఉన్న, తీవ్రంగా దెబ్బతిన్న దేశాలైన భారత్‌, మెక్సికోలతో పాటు... తమ పొరుగుదేశం కెనడా, మిత్రదేశం దక్షిణ కొరియాలకు నేరుగా పంపిస్తామని బైడెన్‌ వివరించారు.. ఈ నేపథ్యంలో... ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌... భారత ప్రధాని నరేంద్రమోదీతో ఫోన్‌లో మాట్లాడి... వ్యాక్సిన్లను పంపించే వివరాలను పంచుకున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్లు తయారవుతున్నప్పుడే... అమెరికా తన అవసరాలకంటే ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చింది. తమ మొత్తం జనాభాకు టీకాలు పూర్తయినా కూడా భారీ స్థాయిలో... (సుమారు 8 కోట్లు) మిగిలిపోయేంతగా నిల్వలు సమకూర్చుకుంది. వృథాగా వాటిని నిల్వ ఉంచుకోవటంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బైడెన్‌ ప్రభుత్వం మిగులు టీకాలను ప్రపంచానికి పంచాలని నిర్ణయం తీసుకుంది.


Tags :

మరిన్ని