ఉన్నత విద్యకు.. చలో విదేశాలకు!
ఉన్నత విద్యకు.. చలో విదేశాలకు!

 కరోనా సమయంలోనూ విద్యార్థుల తాకిడి

సాధారణ రోజులతో పోల్చితే పెరుగుదల

ఈనాడు, హైదరాబాద్‌: విదేశీ వర్సిటీల్లో సింహభాగం ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభం కానుండటంతో విదేశాలకు వెళ్లేందుకు విద్యార్థులు ఉవ్విళ్లూరుతున్నారు. ఉస్మానియా పరిధిలో గతేడాది 7138 మంది ట్రాన్స్‌స్క్రిప్టులు (మార్కుల ధ్రువీకరణ పత్రాలు) తీసుకోగా.. ఈఏడాది ఇప్పటివరకు 4,314 మంది తీసుకోవడమే దీనికి నిదర్శనం. జేఎన్‌టీయూ పరిధిలో గతేడాది 1.40 లక్షల మంది పొందగా.. ఈసారి ఇప్పటివరకు ఏకంగా 1.25 లక్షల మంది తీసుకోవడం గమనార్హం. విదేశీ విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు ట్రాన్స్‌స్క్రిప్టులే కీలకం. వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌(వెస్‌) లేదా ఇతర ఏజెన్సీలతో వర్సిటీలు ధ్రువీకరించుకున్నాక విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తాయి.

ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం

మనదేశం నుంచి ఎక్కువగా అమెరికా, కెనడా, యూకే వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం అక్కడ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా సాగుతుండటం, అధిక శాతం జనాభాకు టీకాలు వేయడంతో ఉన్నత విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. గతేడాది ప్రవేశాలు తీసుకున్న విద్యార్థులకు తొలుత ఆన్‌లైన్‌లో తరగతులు ప్రారంభించినా.. ప్రత్యక్ష బోధనకు అనుమతించడంతో విద్యార్థులు విదేశీబాట పట్టారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఐపీఎంలో విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకా కార్యక్రమం చేపట్టగా, 10 వేల మంది వేయించుకున్నారు. ‘‘ప్రస్తుతం మన దేశంలో ఉన్నత విద్యలో అస్థిరత కనిపిస్తోంది. అమెరికా సహా పలు దేశాల్లో వ్యాక్సినేషన్‌ కావడంతో వర్సిటీల్లో ప్రత్యక్ష బోధన జరుగుతోంది. ఉన్నత విద్యను పూర్తిచేసి త్వరగా ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులు విదేశాలకు వెళ్లడం మేలని భావిస్తున్నారు’’ అని ఓయూ మాజీ ఉపకులపతి రామచంద్రం విశ్లేషించారు. ఇంజినీరింగ్‌, బీకాం, బీబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉస్మానియా, జేఎన్‌టీయూ పరిధిలో చివరి ఏడాది ఇంజినీరింగ్‌, ఇతర పరీక్షలు జరుగుతున్నాయి. అనంతరం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. గతేడాదిని మించి ఈసారి ట్రాన్స్‌స్క్రిప్టులు తీసుకునే అవకాశం ఉందని ఓయూ పరీక్షల నియంత్రణ విభాగం అధికారి శ్రీరామ్‌ వెంకటేశ్‌ వివరించారు.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని