స్థిరపడటానికే వేదిక.. నమోదుకు లేదు తీరిక
స్థిరపడటానికే వేదిక.. నమోదుకు లేదు తీరిక

అమెరికాలో జననాల నమోదుకు ఎన్‌ఆర్‌ఐల నిరాసక్తత
అరబ్‌ దేశాల్లోని భారతీయుల ఆసక్తి
161 దేశాల్లో 46,475 మంది జననం..  7,428 మంది కన్నుమూత
‘2019’ వివరాలు వెల్లడించిన జనగణన శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: భారతీయుల్లో ఎక్కువ మంది అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. భవిష్యత్తులోనూ అక్కడే స్థిరపడాలని కలలు కంటుంటారు. ఎట్టకేలకు ఆ కల ఫలించి, ‘ఆశ’యం నెరవేరినా.. అక్కడి భారత రాయబార కార్యాలయాల్లో జననాల సమాచారాన్ని నమోదు చేయించడానికి మాత్రం అమెరికాలోని ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐ) ఆసక్తి చూపడం లేదు. అరబ్‌ దేశాల్లోని భారతీయ కుటుంబాలు మాత్రం ఈ సమాచారాన్ని ఎక్కువగానే నమోదు చేయిస్తున్నాయి. జనగణన శాఖ.. విదేశాల్లో 2019 సంవత్సరంలో జనన, మరణాలకు సంబంధించి తాజాగా వెల్లడించిన వివరాలు ఇవే అంశాలను స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలోని 161 దేశాల్లో నివసిస్తున్న భారతీయ కుటుంబాల్లో 2019, జనవరి 1 నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు సంభవించిన జనన, మరణాల వివరాలను జనగణన శాఖ వెల్లడించింది. ఈ గణాంకాల ప్రకారం.. 161 దేశాల్లో 46,475 జననాలు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లోని భారత రాయబార కార్యాలయంలో అక్కడ నివసించే భారతీయ కుటుంబాలు నమోదు చేయించాయి. ఆ దేశంలో 10,534 శిశువుల జననాలు నమోదయ్యాయి. అత్యల్పంగా సెర్బియా, రొమేనియా, రీయూనియన్‌ ఐలాండ్, మయన్మార్, మాలీ, గ్వాటిమాలా, కెనడా, అల్జీరియా, స్లోవేనియా దేశాల్లో కేవలం ఒక్కో జననం మాత్రమే నమోదైంది. వాస్తవానికి అరబ్‌ దేశాలతో పోల్చితే.. అమెరికాలో నివసిస్తున్న భారతీయ కుటుంబాలే ఎక్కువ. అయినా.. అక్కడ(అమెరికాలో) జననాల నమోదు చాలా స్వల్పంగా ఉంటుండటం చర్చనీయాంశమవుతోంది. 2019లో అమెరికాలో కేవలం 21 జననాలు, 411 మరణాలు నమోదయ్యాయి. ఆ దేశంలోని చికాగో రాష్ట్రంలో భారతీయులు ఎక్కువగా నివసిస్తారు. ఆ రాష్ట్రంలో ఒక్క జననం కూడా భారతీయ రాయబార కార్యాలయంలో నమోదవకపోవడం గమనార్హం. మరణాల వివరాల విషయంలో ఎంతోకొంత మార్పు కనిపిస్తుంది. 70 మంది భారతీయులు (2019లో) మరణించినట్లు నమోదు చేశారు. ఆ దేశంలో అత్యధికంగా న్యూయార్క్‌లో 174, శాన్‌ఫ్రాన్సిస్కోలో 132 మంది కన్నుమూసినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

అమెరికా పౌరసత్వం కోరుకుంటున్నందుకే..!

విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ భారత పౌరసత్వం కోరుకునేవారు అక్కడి భారత రాయబార కార్యాలయాల్లో జనన, మరణాలను నమోదు చేయిస్తూ ధ్రువీకరణ పత్రం తీసుకుంటున్నారు. అమెరికాలో ఉన్న వారు.. అక్కడి పౌరసత్వాన్ని కోరుకుంటున్నందున భారత రాయబార కార్యాలయంలో జననాల వివరాలను పెద్దగా నమోదు చేయించడం లేదు. 2019లో 161 దేశాల్లో మొత్తం 7,428 మంది భారతీయులు వివిధ కారణాలతో కన్నుమూశారు. అందులో అత్యధికంగా సౌదీ అరేబియాలో 2,353, యూఏఈలో 1,410, కువైట్‌లో 707, బహ్‌రెయిన్‌లో 211 నమోదయ్యాయి. ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, కువైట్, మలసియా, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్‌ తదితర దేశాల్లో 200 నుంచి 4 వేల దాకా జననాలు నమోదయ్యాయి.

బాలుర జననాలే ఎక్కువ..

ఇక్కడి మాదిరిగానే విదేశాల్లోనూ భారతీయుల కుటుంబాల్లో బాలికలకన్నా బాలుర జననాలు ఎక్కువగా ఉంటున్నాయి. మహిళలతో పోల్చితే.. పురుషుల మరణాల నమోదు ఎక్కువగా ఉంటోంది. చాలా దేశాల్లో మరణించింది పురుషులా.. మహిళలా అన్న సమాచారం ఇవ్వడం లేదు. విదేశాల్లో భారతీయ యువతులు తక్కువగా ఉన్నారని, అందుకే అక్కడ పనిచేసే భారతీయ యువకులు పెళ్లి చేసుకోవడానికి మనదేశానికి వస్తున్నారని ఓ అధికారి వివరించారు. విదేశాల్లోని భారతీయ కుటుంబాల్లో బాలికల జననాలు తక్కువగా ఉండటం, చదువుకోవడానికి ఇక్కడి నుంచి ఆ దేశాలకు వెళ్లేవారిలో యువకులే ఎక్కువగా ఉండటంతో అక్కడ భారతీయ మహిళల సంఖ్య తక్కువగా ఉన్నట్లు అంచనా.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని