విదేశీ చదువుకు వెళ్లేదెన్నడో!
విదేశీ చదువుకు వెళ్లేదెన్నడో!

ధ్రువపత్రాలు అందించని అటానమస్‌ కళాశాలలు

ప్రవేశాలు చేజారుతాయని విద్యార్థుల్లో ఆందోళన

హైదరాబాద్‌లోని ఓ స్వయంప్రతిపత్తి (అటానమస్‌) ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసిన ఓ విద్యార్థి యూకేలో ఎంఎస్‌ చదివేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. షరతులతో అడ్మిషన్‌ ఆఫర్‌ లెటర్‌ ఇచ్చారు. చివరి సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు విడుదలైనా.. కళాశాల యాజమాన్యం ప్రొవిజినల్‌ సర్టిఫికెట్‌ (పీసీ), కన్సాలిడేషన్‌ మార్క్స్‌ మెమో(సీఎంఎం)లను ఇవ్వలేదు. ఆ ధ్రువపత్రాలు ఉంటేనే యూకే వర్సిటీ నుంచి అసలైన ఆఫర్‌ లెటర్‌ (యూక్యాస్‌- ద యూనివర్సిటీస్‌ అండ్‌ కాలేజెస్‌ అడ్మిషన్‌ సర్వీస్‌) వస్తుంది. అది ఉంటేనే వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది. సెప్టెంబరు 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీసా ప్రక్రియ పూర్తవుతుందో, లేదోనని ఆ విద్యార్థి, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రం నుంచి ఏటా 15 వేల మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తుంటారు. ఈసారి 20 వేల మందికి పైగా వెళ్లే అవకాశముందని అంచనా. అమెరికాకు చెందిన అధిక శాతం వర్సిటీలు బీటెక్‌ మూడో ఏడాది వరకు ధ్రువపత్రాలు ఉన్నా ప్రవేశ అంగీకార పత్రాన్ని(ఐ-20) పంపిస్తాయి. కొన్ని ప్రముఖ వర్సిటీలు మాత్రం అన్ని ధ్రువపత్రాలు సమర్పిస్తేనే ప్రవేశాలిచ్చేందుకు అంగీకరిస్తాయి.

జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో 36 అటానమస్‌ కళాశాలలు ఉన్నాయి. ఇందులో కొన్ని కళాశాలలు ఇష్టారాజ్యంగా మార్కులు ఇస్తున్నాయని, ధ్రువపత్రాలను ఒక్కో కళాశాల ఒక్కోలా ఇస్తున్నాయని భావించిన జేఎన్‌టీయూహెచ్‌ తాము ఆమోదించాకనే విద్యార్థులకు ధ్రువపత్రాలను అందించాలని చెప్పింది. ఓ గ్రూపు విద్యాసంస్థకు చెందిన కళాశాల ఇటీవల వర్సిటీ ఆమోదం కోసం దస్త్రం పంపింది. దానికి ఆమోదం లభించలేదని, ధ్రువపత్రాలను ఇవ్వలేమని కళాశాల యాజమాన్యం చేతులెత్తేసింది. ఇదే విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది.

- ఈనాడు, హైదరాబాద్‌

Advertisement

Tags :

మరిన్ని