ఘనంగా 5వ అంతర్జాతీయ భాగవత జయంతి ఉత్సవాలు
ఘనంగా 5వ అంతర్జాతీయ భాగవత జయంతి ఉత్సవాలు

సింగపూర్: తెలుగు భాగవత ప్రచార సమితి వారి ఆధ్వర్యములో 5వ అంతర్జాతీయ భాగవత జయంత్యుత్సవములు ఆన్‌లైన్‌ వేదికగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, పలు భాగవత పద్యాలు, కీర్తనలు, పద్య కథనాలు తెలుగువారందరినీ అలరించాయి. ఈ వేడుకలలో  ప్రపంచవ్యాప్తంగా ఎందరో పిల్లలు నమోదుచేసుకోగా, వారి నుండి ఎంపికైన 75 మంది చిన్నారులు ఇచ్చిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సింగపూర్, భారత్‌ నుంచే కాకుండా, అమెరికా, మలేషియా దేశాల నుంచి కూడా పిల్లలు పాల్గొని కార్యక్రమానికి వన్నె తెచ్చారు. చిన్నారులలో మన సాంస్కృతిక విలువల మీద ఆసక్తి పెంచడానికి చేస్తున్న ఈ వార్షిక కార్యక్రమానికి మౌర్య, మనుశ్రీ ఆకునూరి వ్యాఖ్యానాన్ని అందించి ప్రేక్షకులందరినీ అలరించారు. రమ్య భాగవతుల, నమ్రత దేవల్ల వారికి సహకారం అందిస్తూ పిల్లలని మరింత ఉత్సాహ పరిచారు.

ప్రముఖ నేపథ్య గాయకులు నేమాని పార్థసారథి (కీర్తన అకాడెమీ ఆఫ్ మ్యూసిక్), షర్మిల (మహతి అకాడెమీ), కిడాంబి విక్రమాదిత్య (ముకుందమాల బృందం), విద్య కాపవరపు (విద్య సంగీతం అకాడెమీ) అపర్ణ ధార్వాడలు తమ విద్యార్థుల ప్రతిభకు గత రెండు నెలలుగా సానపెట్టి ఈ కార్యక్రమంలో ప్రదర్శనకు తయారు చేశారు.   అలాగే, ఈ కార్యక్రమంలో కవుటూరు రత్నకుమార్, మల్లిక్ పుచ్చా వంటి ప్రముఖులు పాల్గొని పిల్లలను ప్రోత్సహించారు.

ఈ అంతర్జాల భాగవత జయంత్యుత్సవములు చక్కగా కూర్పు చేయటంలో సహకరించిన RK వీడియోగ్రఫీ (రాధా కృష్ణ గణేష్ణ, కాత్యాయని)లకు భాగవత ప్రచార సమితి తరపున  నిర్వాహకులు హృదయ పూర్వక ధన్యవాదములు తెలియచేశారు. ఈ కార్యక్రామాన్ని విజయవంతంగా నిర్వహించిన  తెలుగు భాగవత ప్రచార సమితి సభ్యులందరికి, ముఖ్యంగా నిర్వహణ కమిటీ సురేష్ చివుకుల, నమ్రత దేవల్ల, రమ్య బొమ్మకంటి, రవితేజ భాగవతుల, విద్యాధరి కాపవరపు, మౌర్య ఊలపల్లిలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.


Advertisement

Advertisement


మరిన్ని