అఫ్గాన్‌ శాంతిలో వారికీ భాగస్వామ్యం: బైడెన్‌ 
అఫ్గాన్‌ శాంతిలో వారికీ భాగస్వామ్యం: బైడెన్‌ 

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ విషయంలో అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్‌ 11 నాటికి ఆ దేశం నుంచి తమ బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం ఓ టీవీ ప్రసంగంలో వెల్లడించారు. 

‘అఫ్గానిస్థాన్‌ సుస్థిర భవిష్యత్తులో భారత్‌, పాకిస్థాన్‌, రష్యా, చైనా, టర్కీ దేశాలకూ భాగస్వామ్యం ఉంది. కాబట్టి, ఆ దేశంలో శాంతిని నెలకొల్పేందుకు ఆయా దేశాలు కృషి చేయాలి. అఫ్గానిస్థాన్‌ నుంచి మా పూర్తి బలగాలను సెప్టెంబర్‌ 11నాటికి వెనక్కి తీసుకునేందుకు నిర్ణయించాం’ అని బైడెన్‌ ప్రకటించారు. శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకీ మాట్లాడుతూ...‘అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులను ఏ సైన్యం పరిష్కరించలేదు. కేవలం దౌత్యపరమైన మార్గాల్లో మాత్రమే అక్కడి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మేం అక్కడి నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ ఆ దేశానికి దౌత్యపరమైన సహకారం కొనసాగిస్తాం’ అని తెలిపారు. కాగా, 2021 సెప్టెంబర్‌ 11 నాటికి అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రదాడి జరిగి 20ఏళ్లు పూర్తవుతుండటం గమనార్హం. 


Advertisement

Advertisement


మరిన్ని