రెండో సంవాదం లేదు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
రెండో సంవాదం లేదు

ప్రకటించిన డిబేట్స్‌ కమిషన్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్‌ ట్రంప్‌, జో బైడెన్‌ల మధ్య జరగాల్సిన రెండో ముఖాముఖిపై సందిగ్ధత వీడింది. అక్టోబర్‌ 15న జరగాల్సిన ప్రత్యక్ష చర్చను రద్దు చేస్తున్నట్లు ‘కమిషన్‌ ఆన్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్(సీపీడీ)‌’ అధికారికంగా ప్రకటించింది. ఇక అక్టోబర్‌ 22న జరగాల్సిన తుది ముఖాముఖిపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించింది. 

చర్చలో పాల్గొనాల్సిన ట్రంప్‌నకు కరోనా వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఆయన చికిత్స పూర్తి చేసుకున్నారు. శనివారం నుంచి బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. కానీ, చర్చలో పాల్గొనే అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రెండో ముఖాముఖిని వర్చువల్‌గా నిర్వహించాలని సీపీడీ నిర్ణయించింది. దీనిపై ఇద్దరు అభ్యర్థులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాను నేరుగా చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానంటూ వర్చువల్ ముఖాముఖికి ట్రంప్‌ విముఖత వ్యక్తం చేశారు. మరోవైపు బైడెన్‌ ట్రంప్‌తో నేరుగా చర్చలో పాల్గొనేది లేదని ప్రకటించారు. అనంతరం ఇద్దరూ అక్టోబర్‌ 15 రాత్రి చర్చ జరగాల్సిన సమయంలో ఇతర కార్యక్రమాల్ని పెట్టుకున్నారు. దీంతో ముఖాముఖి చర్చ నిర్వహించడం సాధ్యం కాదని సీపీడీ ప్రకటించింది. ఈ నెల 22న జరగాల్సిన తుది దశ చర్చకు మాత్రం ఇద్దరూ అంగీకరించినట్లు వెల్లడించింది.

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడే అభ్యర్థులు బహిరంగంగా ముఖాముఖి చర్చించడం గతకొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికల ముందు మూడుసార్లు జరిగే ఈ చర్చ‌లను సీపీడీ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ట్రంప్‌, బైడెన్‌ల మధ్య తొలి సంవాదం సెప్టెంబరు 29న జరిగింది. ఆ తర్వాత రెండు రోజులకే ట్రంప్‌ కరోనా బారినపడ్డారు.


మరిన్ని