బైడెన్‌ తొలి సంతకం వీటిపైనే..!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బైడెన్‌ తొలి సంతకం వీటిపైనే..!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పాలనతో విసిగిపోయిన ఆ దేశ ప్రజల్లో.. బైడెన్‌ ఇచ్చిన కొత్త హామీలతో ఆశలు చిగురించాయి. అందుకే ఎన్నికల్లో ఆయనకే పట్టం కట్టారు. వాటిని సాకారం చేసే దిశగా ఆయన కార్యాచరణ ప్రారంభించారు. ఈ మేరకు బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పలు కీలక కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసేందుకు సిద్ధమవుతున్నారని వైట్‌ హౌస్‌లో కాబోయే చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ రోన్‌ క్లెయిన్‌ తెలిపారు.

ప్రమాణ స్వీకారం ముగిసి ఓవల్‌ ఆఫీస్‌లో బాధ్యతలు చేపట్టిన వెంటనే దాదాపు 12 కీలక దస్త్రాలపై బైడెన్ సంతకం చేయనున్నట్లు రోనీ తెలిపారు. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. పారిస్‌ ఒప్పందంలో చేరడం, కొవిడ్‌ ఆంక్షల్ని విస్తరించడం, ముస్లిం దేశాలకు రాకపోకలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడం వంటి కీలక అంశాలపై తొలిరోజే బైడెన్‌ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ట్రంప్‌ నిబంధనల వల్ల పిల్లలకు దూరమైన వలస వచ్చిన తల్లిదండ్రుల విషయంలో బైడెన్‌ మానవత్వంతో వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. వారంతా తిరిగి కలుసుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రెండోరోజు పూర్తిగా కరోనా వ్యాప్తిని అరికట్టడం, విద్యా సంస్థలు తిరిగి తెరిచేందుకు ఉన్న అవకాశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బైడెన్‌ దృష్టి సారించనున్నట్లు అధికారులు తెలిపారు. నిర్ధారణ పరీక్షలు పెంచడం, కరోనా యోధులకు మరింత రక్షణ కల్పించడం సహా క్షేత్ర స్థాయిలో వైద్యారోగ్య ప్రమాణాల్ని పెంచే దిశగా నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అలాగే 100 రోజులు మాస్క్‌ తప్పనిసరి చేసే దిశగానూ చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. జనవరి 20న బైడెన్‌ ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..

బైడెన్‌ రిహార్సల్‌ వాయిదా!

ట్రంప్‌ హయాంలో అత్యధిక మరణశిక్షలు..!మరిన్ని