బైడెన్‌ మాటలు హర్షణీయం: తానా అధ్యక్షుడు
బైడెన్‌ మాటలు హర్షణీయం: తానా అధ్యక్షుడు

టెక్సాస్‌: అగ్రరాజ్యంలో భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం నానాటికీ పెరుగుతోందని అధ్యక్షుడు బైడెన్‌ అనడం హర్షణీయమని తానా అధ్యక్షుడు జయశేఖర్‌ తాళ్లూరి ఆనందం వ్యక్తం చేశారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)లో ఏరోస్పేస్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ స్వాతి మోహన్‌తో బైడెన్‌ వర్చువల్‌ విధానంలో మాట్లాడుతూ.. భారత సంతతి ఈ దేశంపై ఆధిపత్యం చెలాయిస్తోందని అన్నారు. బైడెన్‌ మాటలను గుర్తుచేసిన జయశేఖర్‌ వాటిని స్వాగతించారు. బైడెన్‌ పాలకవర్గంలో సుమారు 55 మంది భారతీయ అమెరికన్లు కీలక పదవుల్లో ఉన్నారని జయశేఖర్ తెలిపారు. అమెరికా జనాభాలో 1 శాతం మాత్రమే భారతీయులు ఉన్నారని, అలాంటిది 55 పదవుల్లో భారతీయ సంతతికి చెందినవారిని నియమించడం సాధారణ విషయం కాదన్నారు. వారికి అలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన అధ్యక్షుడికి జయశేఖర్‌ ధన్యవాదాలు తెలిపారు.

ఫార్చూన్‌ 500 సంస్థల్లోని అనేక వాటిల్లో మనవారు సీఈఓలుగా ఉన్నారని తానా అధ్యక్షుడు అన్నారు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అడోబ్‌, ఐబీఎం, సిటీ బ్యాంక్‌, మాస్టర్‌ కార్డ్‌ సహా పలు ప్రముఖ సంస్థల్లో భారతీయ అమెరికన్లే సీఈఓలుగా ఉన్నారని గుర్తుచేశారు. కొన్ని ఆసుపత్రులు, హోటళ్లను భారతీయులే నడిపిస్తున్నారని తెలిపారు.  నాసాలో భారతీయులు  శాస్త్రవేత్తలుగా రాణిస్తున్నారని.. అమెరికా ఐటీ విభాగంలోనూ మనవాళ్లే ఎక్కువగా ఉన్నారని కొనియాడారు. అమెరికాలో భారతీయులు ఇంతటి గొప్ప స్థానాల్లో ఉండటం గర్వకారణమని జయశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement


మరిన్ని