75 ఏళ్ల స్వాతంత్ర్య భారతావనికి ‘తానా’ గానామృతాభిషేకం! 
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
75 ఏళ్ల స్వాతంత్ర్య భారతావనికి ‘తానా’ గానామృతాభిషేకం!  

భారీ ఏర్పాట్లు చేస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక

న్యూయార్క్‌: భారత్‌ 75వ స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధమవుతున్న వేళ తానా వినూత్న కార్యక్రమానికి భారీ సన్నాహాలు చేస్తోంది. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో దేశభక్తిపూర్వక సాహిత్యంతో 75 మంది రచయితలు రాసిన 75 లలిత గీతాలను 75 మంది గాయనీ గాయకులతో ఆలపించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ గీతాలను ఈ ఏడాది ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌లో ఆవిష్కరించి భారత 75వ స్వాతంత్ర్య వేడుకలను వైవిధ్యంగా, సంగీతభరితంగా, ఉత్సాహంగా, ఘనంగా జరుపుకోనున్నట్టు తానా అధ్యక్షుడు జయశేఖర్‌ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహాకులు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ.. ఈ 75 లలిత గీతాలలో గతంలో దేవులపల్లి, సినారె, దాశరథి, గిడుగు, బాలాంత్రపు, రాయప్రోలు, మల్లవరపు, కందుకూరి, ఇంద్రగంటి, వింజమూరి, శశాంక, కోపల్లె లాంటివారెందరో మహానుభావులు రచించిన అద్భుతమైన దేశభక్తి గీతాలతో పాటు ఈ తరం రచయితలైన వోలేటి, వడ్డేపల్లి, కలగా, రసమయి రాము, వారణాసి, బాపురెడ్డి, బలభద్రపాత్రుని మధు, సుధామ రాసిన గీతాలు; ప్రముఖ సినీగేయ రచయితలు సుద్దాల, జొన్నవిత్తుల, అనంత శ్రీరామ్‌, భువనచంద్ర, భారవి, సిరాశ్రీ, కాసర్లతో పాటు నవతరం రచయితల గీతాలు కూడా ఉంటాయని వివరించారు. లిటిల్‌ మ్యుజీషియన్స్‌ అకాడమీ అధినేత కొమండూరి రామాచారి నిర్వహణలో ఈ లలిత గీతాలకు స్వరకల్పన చేసి, వివిధ దేశాల్లో ఉన్న 75మంది ఉత్తమ గాయనీ గాయకులతో గానం చేయిస్తారని, మధురా ఆడియో కంపెనీ అదినేత శ్రీధర్‌ రెడ్డి సారథ్యంలో ఈ గీతాలకు కావలసిన అన్ని హంగులు సమకూర్చి వీడియో రూపంలోకి తీసుకొచ్చి ఆగస్టు 15న జరిగే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేలా తానా ప్రపంచ సాహిత్య వేదిక ద్వారా యూట్యూబ్‌లో ఈ గీతాలను గీతాలను విడుదల చేస్తామని వెల్లడించారు. 

అలాగే, ఆసక్తి ఉన్న రచయితలు భారతీయ సంస్కృతి, దేశభక్తి స్ఫూర్తి, జాతీయోద్యమ సంఘటనలు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం అనే ఏ ఇతివృత్తంతోనైనా ఒక పల్లవి, రెండు చరణాలకు మించని లలిత గీతాలను A4 సైజులో వచ్చేలా రాసి పంపాలని తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ విజ్ఞఫ్తి చేశారు. ఈ రచన మీ సొంతమని రాతపూర్వకంగా ధ్రువీకరిస్తూ, మీ చిరునామా, ఫోన్‌ నంబర్‌ తెలియపరచాలన్నారు. ఆయా రచనలను మే 20నాటికి +91 9121081595కు వాట్సాప్‌ ద్వారా పంపాలని కోరారు. నిర్ణాయక సంఘం ఆయా రచనలను పరిశీలించి ఎంపిక చేసినట్లయితే..  ఆ విషయాన్ని జులై 15తేదీ లోపు తెలియజేస్తామని తెలిపారు. ఎంపికలో తుది నిర్ణయం నిర్ణాయక సంఘానిదేనని ఆయన స్పష్టంచేశారు.


మరిన్ని