బ్రిటన్‌లో తెలుగు వ్యక్తికి కీలక పదవి
బ్రిటన్‌లో తెలుగు వ్యక్తికి కీలక పదవి

లండన్‌: బ్రిటన్‌లో తెలుగు వ్యక్తికి కీలక పదవి దక్కింది. హైదరాబాద్‌కు చెందిన జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ చంద్ర కన్నెగంటి స్ట్రోక్‌ ఆన్‌ ట్రెంట్‌ నగర డిప్యూటీ లార్డ్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. కౌన్సిలర్‌గా ఉన్న ఆయన ఇటీవలే డిప్యూటీ లార్డ్‌ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఓ తెలుగు వ్యక్తి ఈ పదవికి ఎన్నికవ్వడం ఇదే తొలిసారి. గుంటూరు మెడికల్‌ కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేసిన ఆయన స్ట్రోక్‌ ఆన్‌ ట్రెంట్‌ నగరంలో కొంతకాలంగా స్థిరపడ్డారు.

కన్జర్వేటివ్‌ పార్టీ నుంచి పోటీ చేసిన చంద్ర కన్నెగంటి లేబర్‌ పార్టీ అభ్యర్థిపై 23 ఓట్ల తేడాతో గెలుపొందారు. సాధారణంగా లార్డ్‌ మేయర్‌ తర్వాతి స్థానంలో డిప్యూటీ లార్డ్‌ మేయర్లు ఉంటారు. యూకేలోని 23 నగరాలకు లార్డ్‌ మేయర్లు ఉన్నారు. భవిష్యత్‌లో లార్డ్‌ మేయర్ పదవికి చంద్ర కన్నెగంటి ఎంపికయ్యే అవకాశం ఉంది. డిప్యూటీ లార్డ్‌ మేయర్‌గా ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2006లో తాను స్ట్రోక్‌ ఆన్‌ ట్రెంట్‌ నగరానికి వచ్చానన్నారు. ఇక్కడున్న వారిలో దాదాపు 10 శాతం మంది ఆసియన్లే అని చెప్పారు. భారత్‌-పాక్‌ మధ్య వైరం ఉన్నప్పటికీ.. ఇక్కడ మాత్రం తామంతా ఒక్కటిగా జీవిస్తున్నామని, అందరి సహకారంతోనే తాను గెలుపొందానని వివరించారు.

Advertisement

Advertisement


మరిన్ని