ఆలస్యమైతే అమెరికాలో అలజడి..
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆలస్యమైతే అమెరికాలో అలజడి..

అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై జుకర్‌బర్గ్‌  

శాన్‌ఫ్రాన్సిస్కో: అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆలస్యమైతే అమెరికాలో అలజడి తప్పదని హెచ్చరిస్తున్నారు ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌. ఇది తమకు పరీక్షాకాలమని చెప్పిన జుకర్‌.. అధ్యక్ష ఎన్నికలపై తాము విస్తృత స్థాయిలో పనిచేస్తున్నామని తెలిపారు. 

‘ప్రస్తుతం దేశ ప్రజలు రెండుగా విడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాలు రావడానికి రోజులు లేదా వారాల సమయం పడితే దేశంలో పౌర ఆందోళనలు జరిగే ప్రమాదం ఉంది’ అని ఫేస్‌బుక్‌ కాన్ఫరెన్స్‌లో జుకర్‌బర్గ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ ఎన్నికల కోసం ఫేస్‌బుక్‌ గత నాలుగేళ్లుగా విస్తృత స్థాయిలో పనిచేస్తోందని, వచ్చే వారం తమకు పరీక్షా సమయమని అన్నారు. ఎన్నికల సమగ్రతను కాపాడటం పెను సవాల్‌ అని.. ఈ విషయంలో ఫేస్‌బుక్‌ ఉత్తమంగా పనిచేస్తోందని చెప్పారు. 

2016 అధ్యక్ష ఎన్నికల తర్వాత ఫేస్‌బుక్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. కేంబ్రిడ్జ్‌ అనలిటికా కుంభకోణం వెలుగులోకి రావడంతో ఫేస్‌బుక్‌ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. న్యాయపరమైన ఇబ్బందుల్లోనూ చిక్కుకుంది. అప్పటి నుంచి ఫేస్‌బుక్‌లో అనేక మార్పులు చేశారు. నకిలీ ఖాతాలను తొలగించడంతో పాటు రాజకీయ, చెల్లింపు ప్రకటనలపై కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. తప్పుదోవ పట్టించే లేదా విద్వేషపూరిత పోస్ట్‌లను ఎప్పటికప్పుడు తొలగిస్తూ వస్తున్నారు. తాజా ఎన్నికల కోసం కూడా ఫేస్‌బుక్‌ తమ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. అయితే అధికార పార్టీకి అనుకూలంగా ఫేస్‌బుక్‌ వ్యవహరిస్తోందని డెమొక్రటిక్‌ నేతలు ఫేస్‌బుక్‌పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. 


మరిన్ని