CoronaVaccine: ఆ టీకాలు భారత్‌కు పంపండి
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
CoronaVaccine: ఆ టీకాలు భారత్‌కు పంపండి

 అమెరికా పౌరహక్కుల ఉద్యమకారుడి విజ్ఞప్తి

ఇంటర్నెట్‌డెస్క్‌: అత్యంత దారుణమైన కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొంటున్న భారత్‌కు సాయం మరింత పెంచాలని అమెరికా అధ్యక్షుడిపై ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా ఆ దేశానికి చెందిన పౌరహక్కుల ఉద్యమకారుడు ఒకరు గళమెత్తారు. అమెరికాలో నిరుపయోగంగా పడిఉన్న 6 కోట్ల ఆస్ట్రాజెనెకా టీకాలను భారత్‌కు ఇవ్వాలని అధ్యక్షుడు బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు. షికాగోలో జరిగిన ఒక ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పౌరహక్కుల నేత రెవ్‌ జెస్సీ జాక్సన్‌ మాట్లాడుతూ.. బైడెన్‌ సర్కారు వెంటనే 60 మిలియన్ల ఆస్ట్రాజెనెకా టీకాలను భారత్‌కు తరలించాలని కోరారు. ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న ప్రజారోగ్య సంక్షోభం కుదుట పడాలంటే మాస్‌ వ్యాక్సినేషన్‌ తప్ప మరో మార్గం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘వారంతా మనుషులు.  వైరస్‌ను మనం ఈ రోజు అడ్డుకోకపోతే అది గాలికంటే వేగంగా వ్యాపించి ప్రపంచాన్ని కమ్మేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. తానే స్వయంగా ఫార్మా పరిశ్రమలోని దిగ్గజాలతో మాట్లాడి భారత్‌కు మరిన్ని ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, సిలిండర్లు, ఔషధాలు పంపేందుకు కృషి చేస్తానన్నారు.

ఇప్పటి వరకు అమెరికాలో ఆస్ట్రాజెనెకా టీకాకు అనుమతులు మంజూరుకాలేదు. దీంతో అమెరికా కొనుగోలు చేసిన 60 మిలియన్ల డోసులు గోదాముల్లో పడిఉన్నాయి. గతంలో ఓ సందర్భంలో బైడెన్‌ మాట్లాడుతూ వాటిని ఇతర దేశాలకు ఇచ్చేసే ఉద్దేశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో జెస్సీ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకొంది.


మరిన్ని