సోషల్‌ మీడియాలోకి ట్రంప్‌ రీ ఎంట్రీ!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సోషల్‌ మీడియాలోకి ట్రంప్‌ రీ ఎంట్రీ!

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సామాజిక మాధ్యమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారట. అదేంటి ట్విటర్‌, ఫేస్‌బుక్‌ సహా ఇతర సోషల్‌ మీడియా వేదికలు ఆయన ఖాతాలను నిషేధించాయి కదా! మళ్లీ ఎలా వస్తారనేగా మీ అనుమానం. అయితే, ట్రంప్‌ ఈ సారి తనను తొలగించిన వేదికల నుంచి కాకుండా.. తానే స్వయంగా మరో కొత్త సామాజిక మాధ్యమ వేదికను ప్రారంభించనున్నారని సమాచారం. రెండు లేదా మూడు నెలల్లో ఆ నూతన వేదికను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆయన సీనియర్‌ సలహాదారు ఒకరు ఓ ఆంగ్ల మీడియాతో వెల్లడించారు. ఆ కొత్త వేదికగానే ఆయన మళ్లీ నెటిజన్ల ముందుకు రాబోతున్నారని 2020 ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌నకు అధికార ప్రతినిధిగా వ్యవహరించిన జేసన్‌ మిల్లర్‌ మీడియాకు తెలిపారు.

‘ట్రంప్‌ మళ్లీ సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టనున్నారు. ఈ సారి ఆయన తాను సొంతంగా పెట్టబోయే నూతన సామాజిక మాధ్యమ వేదికపైనే ప్రజలకు అందుబాటులోకి రానున్నారు’ అని తెలిపారు. కానీ, ఈ అంశానికి సంబంధించి ఇతర అదనపు వివరాలేమీ మిల్లర్‌ వెల్లడించలేదు. మరోవైపు ట్రంప్‌ అధికార వర్గాల నుంచి దీనిపై ఎలాంటి స్పందన రాలేదు.

అమెరికాలో జనవరి 6వ తేదీన క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడికి పాల్పడటం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఆ దాడి తదనంతర పరిణామాలు..  ట్విటర్‌, ఫేస్‌బుక్‌ సహా ఇతర వేదికల నుంచి ట్రంప్‌ నిషేధానికి దారి తీశాయి.


మరిన్ని