జార్జియాలో ఉగాదికి గౌరవం
జార్జియాలో ఉగాదికి గౌరవం

తెలుగు భాష, వారసత్వం దినంగా గుర్తింపు

అట్లాంటా: అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఉగాదికి గుర్తింపు లభించింది. తెలుగు భాష, వారసత్వ దినంగా ఉగాది పండగను గుర్తిస్తున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌ బ్రయన్‌ పి.కెంప్‌ తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. తెలుగు భాషకు గుర్తింపు తీసుకురావడంలో భాగంగా ప్రముఖ జర్నలిస్ట్‌ రవి పోణంగి, పలువురు తెలుగు భాషాభిమానులు వినతి మేరకు గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యంత పురాతమైన భాషల్లో ఒకటైన తెలుగు భాషకు ఎంతో ప్రాధాన్యం ఉందని, తెలుగులో ఎంతో సాహిత్యం ఉందని కొనియాడారు. అధికారిక ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ తెలుగు సంఘాల నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. గవర్నర్‌ ప్రకటన పట్ల జర్నలిస్టు రవి పోణంకి సంతోషం వ్యక్తంచేశారు. 1980 నుంచి అట్లాంటా తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఉగాది నాడు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. తెలుగుకు గుర్తింపు తెచ్చేందుకు విశేషంగా కృషి చేసిన పెమ్మరాజు వేణుగోపాల్‌, వేలూరి వెంకటేశ్వరరావు, డాక్టర్‌ బీకే మోహన్‌, డాక్టర్‌ రవి, శేషు శర్మ, ఫణి డొక్కా, సురేశ్‌ కొలిచాలా, బాలా ఇందుర్తి, జోయిస్‌ బి. ఫ్లుయెకెగెర్‌, వేల్చేరు నారాయణ రావు వంటి వారి కృషికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రముఖులు సైతం హర్షం వ్యక్తంచేశారు.

Advertisement

Advertisement


మరిన్ని