చైనాకు చెక్‌: భారత్‌ను ప్రశంసించిన అమెరికా
చైనాకు చెక్‌: భారత్‌ను ప్రశంసించిన అమెరికా

5జీ ట్రయల్స్‌లో చైనా సాంకేతికను వాడకూడదనే నిర్ణయంపై హర్షం

 

వాషింగ్టన్‌: దేశంలో 5జీ ట్రయల్స్‌లో చైనా సాంకేతికతను వాడకూడదని భారత్‌ తీసుకున్న నిర్ణయంపై అగ్రరాజ్యం అమెరికా ప్రశంసించింది. 5జీ ట్రయల్స్‌లో చైనాకు చెందిన హువాయ్‌, జీటీఈ సాంకేతికతను వాడవద్దని నిర్ణయించడం భారత ప్రజలతో పాటు ప్రపంచానికి శుభవార్త అని పేర్కొంది. చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉన్న అక్కడి టెక్‌ కంపెనీలకు దూరంగా ఉండాలని అమెరికా తన మిత్ర దేశాలకు మరోసారి పిలుపునిచ్చింది.

‘ఆ (చైనా) కంపెనీలను నెట్‌వర్క్‌ల నుంచి మినహాయించకపోతే అది తగ్గించలేని ప్రమాదమే అవుతుంది. ఈ ముప్పును భారత్‌ ముందే గుర్తించినందుకు సంతోషంగా ఉంది. చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉన్న టెక్నాలజీ సంస్థల ముప్పును ఎదుర్కోవడంలో గ్లోబల్‌ లీడర్‌గా భారత్‌ ఎందుకు నిలిచిందో మరోసారి నిరూపితమైంది’ అని విదేశీ వ్యవహారాల కమిటీ చీఫ్‌ రిపబ్లికన్‌ మైఖేల్‌ మెక్‌కాల్‌ పేర్కొన్నారు. భారత్‌ తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలతో పాటు యావత్‌ ప్రపంచానికి సంతోషకరమైన వార్త అని అభిప్రాయపడ్డారు. భారత టెలికమ్యూనికేషన్లలో చైనాకు చెందిన హువాయ్‌ సాంకేతికత వాడవద్దని నిర్ణయం తీసుకున్నందుకు అమెరికా చట్టసభ సభ్యుడు మైక్‌ వాల్ట్జ్‌ భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు.

భారత్‌లో 5జీ ట్రయల్స్‌ ప్రారంభించేందుకు ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఎంటీఎన్‌లకు టెలికాం మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చింది. అయితే, చైనా సంస్థలకు చెందిన ఏ టెక్నాలజీని వాడకూడదని స్పష్టం చేసింది. ఇందుకు ఆయా సంస్థలు అంగీకరించాయి. ఇక ఎరిక్‌సన్‌, నోకియా, శాంసంగ్‌, సీ-డాట్‌తో పాటు రిలయన్స్‌ జియో సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ సాయంతో 5జీ ట్రయల్స్‌ చేస్తున్నాయి.

చైనా కంపెనీలు జాతీయ భద్రతకు పెను ముప్పుగా వాటిల్లాయని అప్పటి ట్రంప్‌ ప్రభుత్వం వాటిపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇదే వరుసలో భారత్‌ కూడా చైనా సాంకేతికతను దూరం పెట్టడంపై అమెరికా హర్షం వ్యక్తంచేస్తోంది.

Advertisement

Advertisement


మరిన్ని