జాత్యహంకార ఘటనలపై మౌనం వీడాలి: బైడెన్‌ 
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
జాత్యహంకార ఘటనలపై మౌనం వీడాలి: బైడెన్‌ 

వాషింగ్టన్‌: జాత్యహంకార ఘటనలకు విరుద్ధంగా అమెరికన్లు గళం విప్పాలని అధ్యక్షుడు జో బైడెన్‌ విజ్ఞప్తి చేశారు. అట్లాంటాలో ఇటీవల ఆసియన్‌ అమెరికన్ల మసాజ్‌ పార్లర్లే లక్ష్యంగా జరిపిన కాల్పుల్ని బైడెన్‌ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం జార్జియాలోని ఎమోరీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించారు. అంతకుముందు జార్జియాకు చెందిన ఆసియన్‌ అమెరికన్‌ కమ్యూనిటీ నాయకులతో సమావేశంలో పాల్గొన్నారు.

‘ద్వేషం, హింసకు సంబంధించిన ఘటనలు దేశంలో తరచూ చోటుచేసుకుంటున్నప్పటికీ.. మనం మౌనంగా ఉంటున్నాం. ఆ పద్దతిలో మార్పు రావాలి. అలాంటి చట్ట విరుద్ధ ఘటనలను మనం అనుమతించకూడదు. వాటికి వ్యతిరేకంగా గళమెత్తి.. చర్యలు తీసుకోవాలి. జాత్యహంకార ఘటనలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి’ అని ఆసియన్‌ అమెరికన్‌ నాయకులకు బైడెన్‌ విజ్ఞప్తి చేశారు. కాగా, కాల్పుల ఘటనను ఇప్పటికే ప్రముఖ అంతర్జాతీయ గాయకురాలు రిహానా, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల సహా పలువురు ప్రముఖులు ఖండించారు. ఇతరుల పట్ల ద్వేషానికి స్వస్తి పలకాలని వారు విజ్ఞప్తి చేశారు.

అమెరికాలోని అట్లాంటాలో ఇటీవల ఆసియన్‌ అమెరికన్ మసాజ్‌ పార్లర్లే లక్ష్యంగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో ఎనిమిది మంది ఆసియన్‌ అమెరికన్లు మరణించారు. ఈ కాల్పుల ఘటనతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న రాబర్ట్‌ లాంగ్‌ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిపై హత్య కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు అట్లాంటా పోలీసులు తెలిపారు.మరిన్ని