నేటి యువతరానికి ఇవి చాలా ఆవశ్యకం
నేటి యువతరానికి ఇవి చాలా ఆవశ్యకం

సింగపూర్‌: నేటి యువతరానికి బుద్ధిబలం, భుజబలం, దైవబలం మూడు చాలా ఆవశ్యకమని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త వద్దిపర్తి పద్మాకర్‌ అన్నారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో, సింగపూర్‌లో నివసించే తెలుగువారిని ఉద్దేశించి తొలిసారిగా అంతర్జాల వేదిక ద్వారా ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా సింగపూర్, ఆస్ట్రేలియా, భారత్ నుంచి పాల్గొన్న కొందరు సభ్యులు అడిగిన ధర్మ సందేహాలకు సోదాహరణంగా వివరించారు.కార్యక్రమంలో భాగంగా వద్దిపర్తి పద్మాకర్‌ మాట్లాడుతూ.. ‘పిల్లలు సన్మార్గంలో నడవడానికి చిన్ననాటి నుంచే మంచివారితో స్నేహం చేసేలా ప్రోత్సహించాలి. మంచి అలవాట్ల గురించి చెప్పాలి’ అని అన్నారు.

అనంతరం వాస్తు శాస్త్రం, స్వధర్మ నిర్వహణ, జన్మ చక్రం, శైవాగమ శాస్త్రాలు, సుబ్రహ్మణ్య స్వామి విశిష్టత, నేటి జీవితంలో నైతిక విలువలు మొదలైన అంశాలపై పలువురు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ ‘ప్రవాసాంధ్రులుగా ఉంటూ మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఎంతోమందికి ఆసక్తి ఉంది. అయితే, మారుతున్న పరిస్థితుల కారణంగా వివిధ ధర్మసందేహాలు మనసులో అందరికీ తలెత్తుతూనే ఉంటాయి. ఇటీవల సామాజిక మాధ్యమాల ద్వారా రకరకాల అనుమానాలు మొదలై మరింత అయోమయానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వద్దిపర్తి పద్మాకర్ వంటి పండితులు ఇచ్చే అమూల్యమైన సమాధానాలు సింగపూర్ తెలుగు ప్రజలకు లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాము’ అని తెలిపారు.

దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి మంగిపూడి రాధిక వ్యాఖ్యాతగా ఆకుండి స్నిగ్ధ, జగదీష్ కోడె సమన్వయకర్తగా, రాధాకృష్ణ సాంకేతిక నిర్వాహకుడిగా వ్యవహరించారు.


Advertisement

Advertisement

Tags :

మరిన్ని