మహాత్మా మన్నించు .. శ్వేతసౌధం ప్రకటన
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మహాత్మా మన్నించు .. శ్వేతసౌధం ప్రకటన

గాంధీ విగ్రహం ధ్వంసంపై ప్రవాస భారతీయుల భారీ ప్రదర్శన

వాషింగ్టన్‌: కాలిఫోర్నియాలోని ఓ పార్క్‌లో  భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని కొందరు సమాజ వ్యతిరేకులు ఇటీవల ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటన పట్ల అమెరికా అధ్యక్ష నివాసం వైట్‌హౌస్‌ విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకీ ‘‘మహాత్మా గాంధీ స్మారక కట్టడాలపై ఈ విధమైన దాడులు జరగటం పట్ల మేము ఆందోళన చెందుతున్నాం. కాలిఫోర్నియా ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దుర్ఘటనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. దోషులను గుర్తించి, శిక్షిస్తాము.’’ అని వెల్లడించారు.

డేవిస్‌ నగరంలోని సెంట్రల్‌ పార్క్‌లో 294 కిలోల బరువు, ఆరడుగుల పొడవు కలిగిన జాతిపిత భారీ కాంస్య విగ్రహం ఉండేది. దానిపై గతవారం గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. మహాత్ముడి ప్రతిమను పీఠం నుంచి తొలగించటమే కాకుండా.. ముక్కలు ముక్కలు చేశారు. ఈ దుర్ఘటన పట్ల అక్కడి భారతీయ అమెరికన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నిరసనగా ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాక్రమెంటోతో సహా పలు భారతీయ అమెరికన్, హిందూ అమెరికన్ సంస్థలు సంయుక్తంగా ఓ ప్రదర్శనను నిర్వహించాయి.

కాగా, మహాత్ముడి విగ్రహానికి జరిగిన అపచారం పట్ల డేవిస్‌ నగర మేయర్‌ గ్లోరియా పాట్రిడా  తీవ్ర విచారాన్ని వెలిబుచ్చారు. మహాత్మా గాంధీ తమకు ప్రేరణ అని.. ఆయన ప్రతిరూపాన్ని ధ్వంసం చేయటాన్ని ఎప్పటికీ మన్నించబోమని ఆమె వెల్లడించారు. ఇటువంటి ఘటనలను ఇకపై పునరావృతం కానీయమని ఆమె హామీ ఇచ్చారు. నగర పోలీసు శాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

ఇవీ చదవండి..

భారతీయ ప్రతిభకు నాసాలో భవ్య స్థానం

అమెరికాలో గాంధీ విగ్రహం అపవిత్రం


మరిన్ని