మహారాష్ట్రలో కీలక నేతలకు భద్రత కుదింపు!

తాజా వార్తలు

Published : 11/01/2021 01:24 IST

మహారాష్ట్రలో కీలక నేతలకు భద్రత కుదింపు!

ముంబయి: మహారాష్ట్రలో పలువురు కీలక ప్రతిపక్ష నేతల భద్రతపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్‌ సహా, ఎంఎన్‌ఎస్‌(మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన) నాయకుడు రాజ్‌ఠాక్రే,, కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలేలకు భద్రతను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించిన రెండు రోజుల అనంతరం ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. 

‘వీఐపీలకు భద్రత కల్పించే అంశమై సమీక్ష నిర్వహించడం నిరంతర ప్రక్రియ. 2019లో చివరిసారి సమీక్ష జరిగింది. కొవిడ్‌ కారణంగా 2020లో నిర్వహించలేదు. కొందరు వీఐపీలకు తాము చేపట్టిన పదవుల కారణంగా ముప్పు పొంచి ఉంటుంది. ఒకవేళ వారు ఆ పదవుల నుంచి వైదొలిగితే ముప్పు పరిస్థితి కూడా మారుతుంది’ అని సమీక్షలో పాల్గొన్న ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భాజపా తీవ్ర విమర్శలు చేసింది. ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని భాజపా నేత రామ్‌ కదమ్‌ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్‌ స్పందిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తన పర్యటనలు, ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు. 

మహారాష్ట్ర మాజీ సీఎం ఫడణవీస్‌కు ఇప్పటి వరకూ బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనంతో కూడిన ‘జెడ్‌ ప్లస్‌’ భద్రత ఉండేది. ఇప్పుడు ‘వై ప్లస్‌’ కేటగిరీ భద్రతకు కుదించారు. దీంతో ఇప్పుడు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోనుంది. ఫడణవీస్‌ సతీమణి అమృతతో పాటు, ఆయన కుమార్తె దివిజల భద్రతను ‘వై ప్లస్‌’ నుంచి ‘ఎక్స్‌’ కేటగిరీకి కుదించారు. అదేవిధంగా ఎంఎన్‌ఎస్‌ నేత రాజ్‌ఠాక్రే భద్రతను ‘జెడ్‌’ కేటగిరి నుంచి ‘వైప్లస్‌’కు కుదించారు. కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలేకు ‘వై ప్లస్‌’ భద్రత ఇవ్వనుంది. గతంలో ఆయనకు ‘వై ప్లస్‌’ భద్రతతో పాటు ఎస్కార్ట్‌ కూడా ఉండేది. ఇంకా పలువురు ప్రతిపక్ష నేతలకు ప్రభుత్వం భద్రతను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఇదీ చదవండి

ఇండోనేషియా విషాదం: బ్లాకు బాక్సుల జాడ లభ్యం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని