close

తాజా వార్తలు

Published : 24/10/2020 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇ‘స్మార్ట్‌’ కిషన్‌: ముంబయి చేతిలో చిత్తైన చెన్నై

అగ్రస్థానంలో ముంబయి.. అట్టడుగన చెన్నై

షార్జా: అనుకున్నదే జరిగింది! చెన్నై చిత్తు చిత్తుగా ఓడింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఘన విజయం సాధించింది. సీజన్‌ తొలి పోరులో ఓటమికి ధోనీసేనపై ప్రతీకారం తీర్చుకుంది. ప్రత్యర్థి నిర్దేశించిన 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వికెట్‌ నష్టపోకుండా ఛేదించింది. యువకెరటం ఇషాన్‌ కిషన్‌ (68; 37 బంతుల్లో 6×4, 5×6), క్వింటన్‌ డికాక్‌ (46; 37 బంతుల్లో 5×4, 2×6) కలిసి 12.2 ఓవర్లకే మ్యాచును ముగించారు. రన్‌రేట్‌ను అమాంతం పెంచేశారు. అంతకు ముందు చెన్నైలో సామ్‌ కరన్‌ (52; 47 బంతుల్లో 4×4, 2×6) అర్ధశతకం అందుకున్నాడు. 14 పాయింట్లు, మెరుగైన రన్‌రేట్‌తో పట్టికలో ముంబయి అగ్రస్థానానికి చేరుకోగా చెన్నై (6 పాయింట్లు) అట్టడుగున నిలిచింది.

కిషన్‌..కిర్రాక్‌
స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ముంబయిని చెన్నై బౌలర్లు కాసేపైనా నిలువరిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఓపెనర్లు కిషన్‌, డికాక్‌ బ్యాటింగ్‌ ముందు వారి ఆటలు సాగలేదు. ఎంత కఠినంగా బంతులు వేయాలని ప్రయత్నించినా పవర్‌ప్లేలో వీరిద్దరూ ఓవర్‌కు రెండు బౌండరీల చొప్పున బాదేశారు. 6 ఓవర్లకు 52/0 స్కోరు అందించారు. ముఖ్యంగా కిషన్‌ సొగసు ఉట్టిపడే కవర్‌డ్రైవ్‌లు ఆడేశాడు. అతడి బ్యాటుకు తాకిన బంతులు ఫీల్డర్ల మధ్యలోంచి నేలను ముద్దాడుతూ బౌండరీ సరిహద్దును దాటేశాయి. ఆ జోరు చూసిన డికాక్‌ సైతం అతడికే ఎక్కువగా స్ట్రైకింగ్‌ ఇచ్చాడు. ఇదే అదనుగా చెన్నై స్పిన్నర్ల బౌలింగ్‌లో కిషన్‌ కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు. 29 బంతుల్లోనే అర్ధశతకం చేశాడు. దాంతో 10 ఓవర్లకు ముంబయి 98/0, 11కు 108/0, 12కు 112/0తో నిలిచింది. 13వ ఓవర్లో డికాక్‌ చక్కని బౌండరీ బాది జట్టుకు విజయం అందించాడు.

కరన్‌ లేకుంటే..!
టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ముంబయి.. ప్రత్యర్థిని ఆదిలోనే ఘోరంగా దెబ్బకొట్టింది. భారీ మార్పులతో బరిలోకి దిగిన ధోనీసేనకు ముచ్చెమటలు పట్టించింది. ట్రెంట్‌ బౌల్ట్‌ (4/18), జస్ప్రీత్‌ బుమ్రా (2/25), రాహుల్‌ చాహర్‌ (2/22) కట్టుదిట్టమైన బంతులతో వణికించారు. ఖాతా తెరవక ముందే ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ (0; 5 బంతుల్లో)ను బౌల్ట్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. రెండో ఓవర్లో అంబటి రాయుడు (2; 3 బంతుల్లో), ఎన్‌.జగదీశన్‌ (0)ను బుమ్రా వరుస బంతుల్లో ఔట్‌ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో డుప్లెసిస్‌ (1; 7 బంతుల్లో)ను బౌల్ట్‌ బోల్తా కొట్టించడంతో చెన్నై 3 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఎంఎస్‌ ధోనీ (16; 16 బంతుల్లో 2×4, 1×6), రవీంద్ర జడేజా (7; 6 బంతుల్లో 1×4) జట్టు స్కోరు 30 లోపే ఔటవ్వడంతో చెన్నై 70 పరుగుల్లోపే ఆలౌటయ్యేలా కనిపించింది.

ఈ క్రమంలో వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ యువ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ మాత్రం జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించేందుకు పట్టుదలతో పోరాడాడు. ఇన్నింగ్స్‌ ఆఖరి బంతి వరకు ఆడాడు. సింగిల్స్‌ తీస్తూ.. సమయోచితంగా బౌండరీలు బాదాడు. దీపక్‌ చాహర్‌ (0; 5 బంతుల్లో), శార్దూల్‌ ఠాకూర్‌ (11; 20 బంతుల్లో) నుంచి సహకారం రాకపోయినా.. ఇమ్రాన్‌ తాహిర్‌ (13*; 10 బంతుల్లో 2×4) అండతో చెలరేగాడు. 15 ఓవర్లకు 71/8తో ఉన్న స్కోరును చివరికి 114/9కి చేర్చాడు. పవర్‌ప్లేలో 24 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన ముంబయి పేసర్లు చివరి ఐదు ఓవర్లలో 43 పరుగులిచ్చి ఒకే వికెట్‌ తీయడం గమనార్హం.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.