IPL 2021: ఐపీఎల్‌కు వచ్చేస్తున్న కేన్‌ మామ!

తాజా వార్తలు

Published : 11/08/2021 01:53 IST

IPL 2021: ఐపీఎల్‌కు వచ్చేస్తున్న కేన్‌ మామ!

ఆక్లాండ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అభిమానులకు శుభవార్త! న్యూజిలాండ్‌ స్టార్‌ క్రికెటర్లు రెండో దశకు అందుబాటులో ఉండనున్నారు. న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ఇందుకు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో జరిగే ఉపఖండం పర్యటనకు రెండోశ్రేణి జట్టును ఎంపిక చేసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు మరో జట్టును ప్రకటించింది. కొవిడ్‌ సమయంలో పనిభారం పర్యవేక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ఎంపికైన న్యూజిలాండ్‌ క్రికెటర్లలో దాదాపుగా అందరూ ఐపీఎల్‌ రెండోదశ ఆడనున్నారు. ఎందుకంటే యూఏఈలోనే ప్రపంచకప్‌ ముందు ఐపీఎల్‌ జరుగుతోంది. మెగా టోర్నీకి ఇది సన్నాహకంగా ఉపయోగపడుతుందని అంతా భావిస్తున్నారు. ప్రపంచకప్‌ ముగిశాక విలియమ్సన్‌ సారథ్యంలోని జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఇక సెప్టెంబర్‌, అక్టోబర్లో బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లో పర్యటించే ద్వితీయ శ్రేణి జట్టుకు టామ్‌ లేథమ్‌ నాయకత్వం వహిస్తాడు.

సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ను పాకిస్థాన్‌తో మూడు వన్డేల సిరీసుకు ఎంపిక చేశారు. టీమ్‌ఇండియాతో టెస్టు సిరీసుకు సన్నద్ధమయ్యేందుకు విశ్రాంతి తీసుకుంటానని అంగీకరించడంతో అతడి పేరు తొలగించారు. 18 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో న్యూజిలాండ్‌ జట్టు పర్యటిస్తుండటం గమనార్హం.

‘న్యూజిలాండ్‌ జట్టు ఆగస్టు 23న బంగ్లాదేశ్‌కు బయల్దేరుతుంది. కోహ్లీసేనతో టెస్టులకు ఎంపికయ్యే సీనియర్లు సిరీస్‌ ముగియగానే స్వదేశానికి చేరుకొని విశ్రాంతి తీసుకుంటారు. జట్టు ఎంపిక చేసేందుకు మరి కొన్ని నెలలు పడుతుంది. ఈ బృందంలో 32 మంది ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుత మహమ్మారి నేపథ్యంలో ఆటగాళ్ల సంక్షేమం, భద్రత కోసం కొత్త వ్యూహాలు అమలు చేయాల్సి వస్తోంది. వారి పనిభారం నిర్వహణ కష్టమవుతోంది’ అని న్యూజిలాండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ అన్నారు. ఐపీఎల్‌పై తాము వాస్తవిక దృక్పథంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

టీ20 ప్రపంచకప్‌, టీమ్‌ఇండియాతో టీ20 జట్టు: కేన్‌ విలియమ్సన్‌, టాడ్‌ ఆస్ట్లే, ట్రెంట్‌ బౌల్ట్‌, మార్క్‌ చాప్‌మన్‌, డేవాన్‌ కాన్వే, లాకీ ఫెర్గూసన్‌, మార్టిన్‌ గప్తిల్‌, కైల్‌ జేమీసన్‌, డారిల్‌ మిచెల్‌, జిమ్మీ నీషమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల్‌ శాంట్నర్‌, టిమ్‌ సీఫెర్ట్‌, ఆడమ్‌ మిల్నీ (గాయపడితే ప్రత్యామ్నాయం)


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని