
తాజా వార్తలు
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు అభిమానులొద్దు
దిల్లీ: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్లో ఆరంభ మ్యాచ్‌లకు అభిమానులను స్టేడియానికి అనుమతించకపోవడం నయమని పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్ వాడియా అన్నాడు. ఏ ప్రాతిపదికన మొహలీని ఐపీఎల్ వేదికల జాబితాలో ఎంపిక చేయలేదో తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఆయన చెప్పాడు. ‘‘కొవిడ్ ప్రభావం ఇంకా ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు స్టేడియానికి అభిమానులు అనుమతించకపోవడం మంచిది. టోర్నీ గడుస్తున్న కొద్దీ ఈ నిబంధనను సడలించొచ్చు. మొహాలీని ఈసారి ఐపీఎల్ ఆతిథ్య జాబితాలో చేర్చకపోవడం నిరాశ కలిగిస్తోంది. మొహాలీ, చండీగఢ్‌లో పెద్దగా కరోనా కేసులు కూడా లేవు. ఈ నిర్ణయం వల్ల సొంతగడ్డపై ఆడడం వల్ల కలిగే ప్రయోజనాన్ని కొన్ని జట్లు పొందలేకపోతున్నాయి. ఏ ప్రాతిపదికన ఈ ఎంపిక జరిగిందో తెలుసుకోవాలని ఉంది. ఇదే విషయంపై బీసీసీఐకి లేఖ కూడా రాశాం. పంజాబ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయనే నమ్మకంతో ఉన్నాం’’ అని వాడియా పేర్కొన్నాడు. కుదించిన ఐపీఎల్ వేదికల జాబితాలో దిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు, చెన్నైని బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
మొహాలీని చేర్చండి.. పంజాబ్ సీఎం: ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించే వేదికల జాబితాలో మొహాలీని కూడా చేర్చాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. ఈసారి టోర్నీ నిర్వహణకు కుదించిన స్టేడియాల జాబితాలో మొహాలి లేకపోవడంతో ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తమకు అవకాశం ఇస్తే కొవిడ్ నేపథ్యంలో మ్యాచ్‌లను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అవసరమైన అతన్ని జాగ్రత్తలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ‘‘రాబోయే ఐపీఎల్ సీజన్లో మొహాలిలో మ్యాచ్‌లు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ నిర్ణయంపై బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి మరోసారి పునరాలోచించాలి. ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు మేం ఎందుకు అర్హులు కామో కారణం తెలియట్లేదు. అవకాశం ఇస్తే అన్ని జాగ్రత్తలతో మ్యాచ్‌లను నిర్వహిస్తాం’’ అని అమరీందర్ చెప్పారు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీకి మొహాలి సొంత మైదానమన్న సంగతి తెలిసిందే.