Tokyo Olympics: కాంస్యం మిస్‌.. హాకీ అమ్మాయిల ఓటమి.. ఆటైతే బంగారమే!

తాజా వార్తలు

Updated : 06/08/2021 11:21 IST

Tokyo Olympics: కాంస్యం మిస్‌.. హాకీ అమ్మాయిల ఓటమి.. ఆటైతే బంగారమే!

బ్రిటన్‌ చేతిలో 3-4 తేడాతో  ఓటమి

అద్భుతం ఆవిష్కృతం అవ్వలేదు. భారత హాకీ అమ్మాయిలు చరిత్రకు అడుగు దూరంలో ఆగిపోయారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బ్రిటన్‌తో ప్లేఆఫ్‌ పోరులో పోరాడి ఓడారు. 3-4 తేడాతో పరాజయం చవిచూశారు. త్రుటిలో కాంస్యం చేజారడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపించారు.

అమ్మాయిలకు కాంస్య పతకం చేజారినా వారి ఆట మాత్రం బంగారమే! ఎప్పుడో 1980లో మహిళల హాకీ అరంగేట్రంలో నాలుగో స్థానంలో నిలిచారు. అప్పుడు ఆడినవి ఆరు జట్లే. ఆ తర్వాత ఒలింపిక్స్‌కు అర్హతే సాధించలేదు.

రియోలో పేలవ ప్రదర్శనే చేసినా టోక్యోలో మాత్రం అదరగొట్టారు. లీగు మ్యాచుల్లో వరుసగా మూడు ఓడినా ఆ తర్వాత విజయ దుందుభి మోగించారు. వారు సెమీస్‌కు చేరుకోవడమే నవ చరిత్రకు నాంది వాచకం. ఎంతోమందికి ప్రేరణ అనడంలో సందేహమే లేదు.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బ్రిటన్‌తో ప్లేఆఫ్‌ పోరులో భారత్‌ దాదాపుగా గెలిచినంత పనిచేసింది. ఆఖరి వరకు పోరాడింది. ఒకానొక దశలో ప్రత్యర్థిని హడలెత్తించింది. వారికి ఓటమి భయం పుట్టించింది. కీలక సమయాల్లో పొరపాట్లు చేయడం, పీసీలను గోల్స్‌గా మలచకపోవడమే టీమ్‌ఇండియాను విజయానికి దూరం చేసింది.

నిజానికి రాణి సేన 2-0తో వెనకబడి ప్రథమార్ధం ముగిసే సరికి 3-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ బ్రిటన్‌ తన అనుభవాన్ని ఉపయోగించి ద్వితీయార్ధంలో రెండు గోల్స్‌తో మన నుంచి కాంస్యం లాగేసుకుంది! భారత్‌ తరఫున గుర్జీత్‌ కౌర్‌ (25ని, 26ని), వందనా కటారియా (29 ని) గోల్స్‌ చేశారు. బ్రిటన్‌లో ఎలీనా రేయర్‌ (16 ని), సారా రాబర్ట్‌సన్‌ (24 ని), హోలీ పేర్న్‌ వెబ్‌ (35 ని), గ్రేస్‌ బాల్డ్‌సన్‌ (48 ని) రాణించారు.

ఆరంభం బ్రిటన్‌దే

అనుకున్నట్టుగానే బ్రిటన్‌ దూకుడుగా మ్యాచ్‌ను ఆరంభించింది. తొలి క్వార్టర్‌ మొత్తం బంతిని తమ అధీనంలోనే ఉంచుకుంది. టీమ్‌ఇండియా కొన్నిసార్లు బ్రిటన్‌ గోల్‌పోస్ట్‌ వృత్తం వద్దకు చేరినా మిడ్‌ఫీల్డ్‌ వైఫల్యంతో అవకాశాలను అందిపుచ్చుకోలేదు. గోల్‌కీపర్‌ సవిత మాత్రం మూడుసార్లు బ్రిటన్‌ గోల్స్‌ను అడ్డుకుంది. రెండో నిమిషంలో పీసీ, 12వ నిమిషంలో రెండు ఫీల్డ్‌ గోల్స్‌ నుంచి కాపాడింది.

గుర్జీత్‌ గర్జన

బ్రిటన్‌ రెండో క్వార్టర్‌లో తొలి గోల్‌ చేసింది. డీప్‌గ్రేస్‌ డిఫ్లెక్షన్‌ను ఎలీనా రేయర్‌ నెట్‌లోకి పంపించి ఖాతా తెరిచింది. మరికాసేపటికే బ్రిటన్‌కు పీసీ లభించినా భారత్‌ మాత్రం ఆధిక్యం పెరగనివ్వలేదు. మరోవైపు భారత్‌ అమ్మాయి లాల్‌రెమిసియామి స్కోర్‌ సమం చేసే ప్రయత్నాన్ని బ్రిటన్‌ గోల్‌ కీపర్‌ అడ్డుకొంది. ఆ తర్వాత టీమ్‌ఇండియాకు ఓ పీసీ లభించినా ఫలితం లేదు. 24వ నిమిషంలో రాబర్ట్‌సన్‌ గోల్‌ చేసి బ్రిటన్‌కు 2-0తో ఆధిక్యం అందించింది. నిమిషాల్లోనే రెండు పీసీలను గుర్జీత్‌ గోల్స్‌గా మలిచి స్కోరును 2-2తో సమం చేసింది. మరికొద్ది సేపటికే వందన ఫీల్డ్‌ గోల్‌ చేసి 3-2తో భారత్‌ను ఆధిక్యంలో నిలిపింది.

ముంచిన వరుస పీసీలు

మూడో క్వార్టర్లో భారత్‌ రక్షణాత్మకంగా ఆడటమే కొంప ముంచింది. గోల్స్‌ కోసం ప్రయత్నించలేదు. దూకుడుగా ఆడలేదు. అయితే బ్రిటన్‌కు లభించిన పీసీని మాత్రం సవిత బాగానే ఆపింది. కొన్ని నిమిషాలకే హోలీ వెబ్‌ గోల్‌ చేసి స్కోరు సమం చేసింది. అప్పుడే లభించిన రెండు పీసీలను భారత్‌ వృథా చేయడంతో ఒత్తిడి పెరిగింది. మరికొద్ది నిమిషాల్లో మూడో క్వార్టర్‌ ముగుస్తుందనగా పీసీ లభించినా రాణి సేన సద్వినియోగం చేయలేదు. ఇక నాలుగో క్వార్టర్‌ ఆరంభంలోనే భారత్‌ వరుసగా నాలుగు పీసీలు ఇచ్చింది. అందులో మూడింటిని అడ్డుకున్నా నాలుగో దాంట్లో బాల్డ్‌సన్‌ గోల్‌ కొట్టింది. ఆ తర్వాత బంతిని తమ అదుపులోనే ఉంచుకొని బ్రిటన్‌ విజేతగా అవతరించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని