Mirabai Chanu: కట్టెల మోపులు మోసిన చేతులతో వెండికొండనే ఎత్తింది

తాజా వార్తలు

Updated : 24/07/2021 16:31 IST

Mirabai Chanu: కట్టెల మోపులు మోసిన చేతులతో వెండికొండనే ఎత్తింది

ఈ రజతం వెనక త్యాగాలెన్నో.. వ్యూహాలెన్నో

మీరాబాయి చాను విజయ గాథ ఇదీ

2016, రియో ఒలింపిక్స్‌. రోజులు గడుస్తున్నాయి. క్రీడాంశాలు ముగుస్తున్నాయి. భారత క్రీడాకారులు పోరాడుతూనే ఉన్నారు. పతకాలు మాత్రం రావడం లేదు. రోజులు గడిచే కొద్దీ భారతీయుల్లో నిరాశ, నిస్పృహ! ఆఖర్లో సాక్షి, సింధు పతకాలు గెలిచేంత వరకు దేశంలో ఒలింపిక్‌ మజానే లేదు.

2021, టోక్యో ఒలింపిక్స్‌. ఏడాది ఆలస్యంగా క్రీడలు ఆరంభమయ్యాయి. కరోనాతో సవ్యంగా సాగుతాయో లేదోనన్న బెంగ. ఈసారైనా భారత అథ్లెట్లు మరిన్ని పతకాలు అందిస్తారా అన్న సందేహాలు. వాటిని పటాపంచలు చేసి భారతీయుల్లో రెండో రోజే జోష్‌ నింపింది మీరాబాయి చాను.

కానీ.. ఆ జోష్‌ వెనక చేసిన త్యాగాలు.. ఎదుర్కొన్న అవమానాలు.. అణచుకున్న ఆందోళన.. గెలవాలన్న తపన.. మళ్లీ మళ్లీ చేసిన సాధన మీకు తెలుసా!!


కట్టెల మోపులతో శిక్షణ

వెనకబడిన ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ నుంచి వచ్చింది మీరాబాయి చాను. 1994, ఆగస్టు 8న ఇంఫాల్‌లోని నాంగ్‌పాక్‌ కాక్‌చింగ్‌లో ఓ సాధారణ కుటుంబంలో జన్మించింది. బాల్యంలో ఎక్కువగా మగపిల్లలతో తిరగడంతో ఆమెనంతా సరదాగా ఏడిపించేవారు. బడికెళ్లే వయసులో ఆమె విలువిద్య నేర్చుకోవాలని భావించింది. ఎప్పుడైతే కుంజరాణి దేవి వెలుగులు చూసిందో వెయిట్‌లిఫ్టింగ్‌ను ఎంచుకుంది. అప్పుడామెకు 12 ఏళ్లు. వంటకోసం కట్టెలు తీసుకొచ్చేందుకు సోదరుడితో అడవికి వెళ్లేది. ఆ కట్టెల మోపులను మోయడమే వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆమెకు లభించిన మొదట శిక్షణ.


రోజూ 60 కి.మీ ప్రయాణించి

మీరాబాయి స్వస్థలంలో ప్రొఫెషనల్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ శిక్షణ శిబిరాలు లేవు. దాతో ఆమె రోజూ 60 కిలోమీటర్లు ప్రయాణించేది. మొదట ఆమె కోచ్‌ అనితా చాను వెదురు బొంగులతో సాధన చేయించేది. రోజూ వెదురుబొంగులు తెప్పించడం.. వాటికి బరువులు పెట్టి మోయిస్తూ టెక్నిక్స్‌ నేర్పించేది. మొదట మెలకువలు ఆపై దృఢంగా మారేందుకు శిక్షణనిచ్చింది. వెయిట్‌ లిఫ్టింగ్‌ ఖరీదైన క్రీడ. సాధకులకు నాణ్యమైన పోషకాహారం అవసరం. మొదట్లో ఆమె వారానికి రెండుమూడు సార్లు మాత్రమే కోడిగుడ్లు, మాంసం తినేది. కొన్నాళ్ల తర్వాత కొన్ని సంస్థలు ఆమెకు స్పాన్సర్‌షిప్‌ ఇవ్వడంతో మరింత కఠోరంగా శిక్షణ మొదలు పెట్టింది.


రియో వైఫల్యం నేర్పిన పాఠం

కష్టేఫలి అని నమ్మిన మీరాబాయి వేగంగా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. 2014లో గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో 48 కిలోల విభాగంలో రజతం గెలిచింది. ఎదగాలంటే ఒత్తిడితో కూడిన క్రీడల్లో పాల్గొనాలన్నది ఆమె మంత్రం. అలాగే చేసి 2016 రియో ఒలింపిక్స్‌కు ఎంపికై సంచలనం సృష్టించింది. అసలైన పోటీల్లో భారీ అంచనాల ఒత్తిడి తట్టుకోలేక అనర్హతకు గురైంది. స్నాచ్‌లో మూడు అవకాశాల్లో ఒకసారే విజయవంతమైంది. మొదట 82కిలోలను ఎత్తలేక విఫలమై రెండో అవకాశంలో సాధించింది. మూడో దఫాలో 84 కిలోలు ఎత్తలేకపోయింది. ఇక క్లీన్‌ అండ్‌ జర్క్‌లో మూడుసార్లూ విఫలమైంది. తొలుత 103కిలోలు విఫలమైంది. విచిత్రంగా రెండోసారి 106 కిలోలు ఎంపిక చేసుకొని తడబడింది. మూడో అవకాశంలోనూ అంతే. గాయాల పాలై స్వదేశానికి చేరుకుంది. కానీ ఆ ఓటమి భారమే ఆమెనో ప్రపంచస్థాయి వెయిట్‌ లిఫ్టర్‌గా మార్చేసింది.


రేపన్నది లేనట్టుగా శిక్షణ

వేటలో గాయపడ్డ బెబ్బులి ఆహారం కోసం శ్రమించిన తీరుగా మీరాబాయి చాను తనను తాను మార్చుకుంది. రోజూ ఆరు గంటలకుపైగా సాధన చేసింది. కోచ్‌ల పర్యవేక్షణలో కొత్త మెలకువలు నేర్చుకుంది. ఎదగాలంటే త్యాగాలు అవసరమని గ్రహించి మొబైల్‌కు పూర్తిగా దూరమైంది. తనకు కావాల్సిన పోషకాహార బాధ్యతలన్నీ మాతృమూర్తి చూసుకొనేది. సమయానికి అన్నీ సిద్ధం చేసేది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు ఏర్పాట్లు చేసేది. నిరాశలో వెన్నుతట్టిన కుటుంబ సభ్యులు మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రోత్సహించేవారు. శిక్షణలో ఆమె తక్కువ సమయంలో ఎక్కువ బరువులెత్తేలా శ్రమించేది. బరువులను పెంచుకునేది. పోటీల్లో పొరపాట్లకు తావివ్వకుండా.. ముందే ఎక్కువ బరువులు ఎంచుకోకుండా.. వ్యూహాత్మకంగా ముందుకు సాగింది. ఆందోళనను అదుపులో పెట్టుకొనేందుకు మానసిక సాధన చేసింది.


టోక్యోలో పతకం ముద్దాడింది

మీరాబాయి కఠిన శ్రమకు ఫలితాలు లభించసాగాయి. 2017లో, అమెరికాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె స్వర్ణం ముద్దాడింది. స్నాచ్‌లో 85 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 109 కిలోలు మొత్తం 194 కిలోలు ఎత్తింది. 2018, గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌లో స్నాచ్‌లో 86, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 110 మొత్తం 196 కిలోలతో జాతీయ రికార్డు నెలకొల్పింది. 2019, థాయ్‌లాండ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో నాలుగో స్థానంలో నిలిచినా.. జాతీయ రికార్డులు బద్దలు కొట్టింది. స్నాచ్‌లో 87, జర్క్‌లో 114 మొత్తం 201 కిలోలు ఎత్తింది. 2020, తాష్కెంట్‌ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో 86.కి, 119.కి మొత్తం 206 కిలోలతో రికార్డులు బద్దలు చేసింది. అదే ఏడాది కోల్‌కతాలో నేషనల్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 88కి, 115కి మొత్తం 203 కిలోలతో స్వర్ణం గెలిచింది. టోక్యోలోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేసింది. 87కి. 115కి. మొత్తంగా 202 కిలోలు ఎత్తి రజతం ముద్దాడింది. 2018లో ఆమె రాజీవ్‌ ఖేల్‌రత్న, పద్మశ్రీని అందుకోవడం ప్రత్యేకం.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని