
చికెనో, మటనో కాకుండా కారంగా మాంసాహారం తినాలని అనిపించినప్పుడు రొయ్యల్ని ట్రై చేస్తే సరి. వాటితోనూ స్పైసీ వంటకాల్ని చేసుకోవచ్చు.
ఫ్రాన్స్65
కావలసినవి
రొయ్యలు: అరకేజీ, కారం: రెండున్నర చెంచాలు, నిమ్మరసం: చెంచా, ఉప్పు: తగినంత, పసుపు: అరచెంచా, దనియాలపొడి: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, గరంమసాలా: చెంచా, మిరియాలపొడి: అరచెంచా, పచ్చిమిర్చి: రెండు, మొక్కజొన్నపిండి: టేబుల్‌స్పూను, బియ్యప్పిండి: టేబుల్‌స్పూను, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ విధానం
ఓ గిన్నెలో శుభ్రం చేసిన రొయ్యల్ని వేసుకోవాలి. వాటిపైన నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని అన్నింటినీ కలిపి గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత ఇవతలకు తీసి... ఒక్కో రొయ్యను కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.
ఫ్రాన్స్ సుక్కా
కావలసినవి
రొయ్యలు: పదిహేను, ఎండుమిర్చి: అయిదు, దనియాలు: రెండు చెంచాలు, జీలకర్ర: చెంచా, ఆవాలు: అరచెంచా, మెంతులు: అయిదారుగింజలు, తాజా కొబ్బరి తురుము: అరకప్పు, చింతపండుగుజ్జు: రెండు చెంచాలు, ఉల్లిపాయ: ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద: మూడు చెంచాలు, పచ్చిమిర్చి: రెండు, టొమాటోలు: రెండు, పసుపు: అరచెంచా, కారం: చెంచా, ఉప్పు: తగినంత, కరివేపాకు రెబ్బలు: రెండు, నూనె: అరకప్పు.
తయారీ విధానం
స్టౌమీద కడాయి పెట్టి నాలుగు ఎండుమిర్చి, మెంతులు, దనియాలు, జీలకర్ర, పావుచెంచా ఆవాలు వేసి వేయించుకుని తీసుకోవాలి. వేడి చల్లారాక కొబ్బరితురుము, చింతపండు గుజ్జుతో కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్టౌమీద మళ్లీ కడాయి పెట్టి నూనె వేసి మిగిలిన ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించి ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి పావు కప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. ఇది గ్రేవీలా అవుతున్నప్పుడు కారం, శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసి... మరో పావుకప్పు నీళ్లు పోయాలి. రొయ్యలు ఉడికి నీళ్లు ఆవిరవుతున్నప్పుడు కొబ్బరి మిశ్రమం వేసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. నీళ్లన్నీ ఆవిరైపోయి కూర పొడిపొడిగా అయ్యాక దింపేయాలి.
ఘీ పెప్పర్ ఫ్రాన్స్ మసాలా
కావలసినవి
రొయ్యలు: కప్పు, నెయ్యి: టేబుల్‌స్పూను, కరివేపాకు: రెండు రెబ్బలు, వెల్లుల్లి తరుగు: టేబుల్‌స్పూను, కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు: చెంచా, ఉల్లిపాయ: ఒకటి, చింతపండు గుజ్జు: చెంచా, బెల్లం తరుగు: అరచెంచా, ఉప్పు: తగినంత. మసాలాకోసం: ఎండుమిర్చి: రెండు, మిరియాలు: చెంచా, జీలకర్ర: చెంచా, సోంపు: చెంచా, అనాసపువ్వు: ఒకటి, కరివేపాకు రెబ్బలు: రెండు.
తయారీ విధానం
ముందుగా స్టౌమీద కడాయి పెట్టి మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలను వేయించుకుని మిక్సీలో వేయాలి. అందులో చింతపండు గుజ్జు, బెల్లం తరుగు, చెంచా నీళ్లు పోసి ముద్దలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక కరివేపాకు, వెల్లుల్లి తరుగు, కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు వేసి వేయించి ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి కూడా వేగాక ముందుగా చేసుకున్న మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి... అందులో శుభ్రం చేసుకున్న రొయ్యలు వేయాలి. రొయ్యలు మెత్తగా అయ్యాక
స్టౌ కట్టేయాలి.
మసాలా ఫ్రాన్స్ కర్రీ
కావలసినవి
పెద్ద రొయ్యలు: పది, నిమ్మరసం: అరచెంచా, కారం: పెద్ద చెంచా, ఉప్పు: తగినంత, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను. మసాలాకోసం: చిక్కని పెరుగు: అరకప్పు, క్రీమ్: పావుకప్పు, ఉల్లిపాయలు: రెండు, టొమాటోలు: మూడు, కారం: పెద్ద చెంచా, ఉప్పు: తగినంత, పసుపు: అరచెంచా, జీలకర్ర: చెంచా, గరంమసాలా: టేబుల్‌స్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, వెన్న: టేబుల్‌స్పూను, నూనె: రెండు పెద్ద చెంచాలు, తందూరీ మసాలా: చెంచా (బజార్లో దొరుకుతుంది).
తయారీ విదానం
రొయ్యల్ని శుభ్రం చేసి ఓ గిన్నెలో తీసుకుని నిమ్మరసం, కారం, తగినంత ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి అన్నింటినీ బాగా కలిపి ఇరవై నిమిషాలసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. స్టౌమీద కడాయి పెట్టి వెన్న వేయాలి. అది కరిగాక అందులో రొయ్యల్ని వేసి వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లంవెల్లుల్లిముద్ద, కారం, పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. అయిదు నిమిషాలయ్యాక టొమాటో ముక్కలు వేయించాలి. అవీ వేగాక క్రీమ్, పెరుగు, గరంమసాలా వేసి బాగా కలపాలి. ఇది చిక్కగా అవుతున్నప్పుడు రొయ్యలు, తందూరీ మసాలా వేసి కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేస్తే సరి.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్