
దేశం ఏదైనా సరే... జాతిని నడిపించే ప్రధానమంత్రులో దేశాధ్యక్షులో పదవిలో ఉన్నంతకాలం వాళ్ల ఇంటి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది! ఇందుకోసం కోట్ల రూపాయలు వ్యయం చేస్తుంది. కానీ ఈ విషయంలో అమెరికా పంథాయే వేరు. అగ్రరాజ్య దేశాధినేత శ్వేత సౌధంలో ఉన్నంతకాలం తనకూ, తన కుటుంబ సభ్యులకూ అయ్యే ఆహారం దుస్తులూ లాండ్రీ ఖర్చులన్నీ సొంతంగా భరించాల్సిందే. ప్రతి పైసా తన జేబు నుంచి తీసివ్వాల్సిందే! టూత్ పేస్ట్ నుంచి మేకప్ సామగ్రిదాకా, బ్రేక్ ఫాస్ట్ నుంచి ఫ్రెండ్స్కిచ్చే పార్టీల దాకా ప్రతి ఖర్చూ అధ్యక్షుడి ఖాతాలో పడాల్సిందే.
ఎందుకిలా? ఈ సంప్రదాయం అనుకోకుండా వచ్చిందే! అమెరికాకి తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ పదవీకాలంలో వైట్‌హౌస్ నిర్మాణం మొదలైనా అది పూర్తయ్యేసరికి ఆయన పాలనాకాలం కూడా ముగిసింది. దాంతో రెండో అధ్యక్షుడు జాన్ ఆడమ్సే ఇందులోకి తొలిసారి ‘గృహ ప్రవేశం’ చేశారు! అప్పట్లో ప్రభుత్వం ఆయన కోసమంటూ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించకపోవడంతో ఆయనే సొంతంగా నియమించుకున్నాడు. ఇతర ఖర్చులన్నీ తానే భరించాడు. ఆ సంప్రదాయమే ఇప్పటికీ కొనసాగుతోంది!
మినహాయింపుల్లేవ... ఉన్నాయి. గత 220 ఏళ్లలో అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుల ఖర్చుల్లో ప్రభుత్వం కూడా కొంత భరించేలా కొన్ని మినహాయింపులు తెచ్చింది. వైట్ హౌస్‌లో ఉంటున్నందుకుగానూ ఇవ్వాల్సిన అద్దె, వంటవాళ్లూ ఇతర సిబ్బంది జీతభత్యాలూ, వైద్య ఖర్చులూ, భద్రతా వ్యయం ప్రభుత్వమే భరిస్తుంది.
వ్యతిరేకత రాలేదా... ఎందుకు రాలేదు. కాకపోతే దీనిపైన విమర్శలు చేసినవాళ్లంతా ఆయా అధ్యక్షుల సతీమణులే... అంటే ప్రథమ పౌరురాళ్లే! 1981లో రొనాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్షుడిగా ఈ భవనంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాతి నెలే ఆయన భార్య నాన్సీ రీగన్- ‘తినే ప్రతి ముద్దా, వాడే ప్రతి సబ్బూ టూత్పేస్టులకి కూడా ఇలా మా వద్ద ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తారని ముందుగానే చెప్పకపోవడం చాలా అన్యాయం’ అంటూ వాపోయారు. జార్జిబుష్ జూనియర్ భార్య లారా బుష్, హిల్లరీ క్లింటన్, మిషెల్ ఒబామా కూడా ఇలా బాధపడ్డవారే!
జీతం సరిపోతుందా... అమెరికన్ అధ్యక్షుడికిచ్చే నెల జీతం మన లెక్క ప్రకారం 2.93 కోట్ల రూపాయలు. దాంతోపాటూ 36 లక్షలదాకా అలవెన్సు ఉంటుంది. కానీ ఈ జీతం శ్వేత సౌధం ఖర్చులకి సరిపోదన్నదే ఇప్పటిదాకా ఉన్న చరిత్ర. వైట్‌హౌస్‌లో అన్నీ చాలా ఖరీదు కావడం వల్ల ప్రతి అధ్యక్షుడూ శ్వేత సౌధం నుంచి అప్పులతోనే బయటకొస్తాడన్నది ఓ అంచనా. కోట్లాధిపతి అయిన ట్రంప్ సంగతి ఇంకా తెలియలేదుకానీ...ఒబామా నుంచి వెనక్కి చూస్తే ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. మరి బైడెన్ ఇన్ని ఖర్చుల్ని ఎలా భరిస్తారో... వాటిపైన ఆయన భార్య ఎలా స్పందిస్తారో చూడాలి!
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్