close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒత్తిడికి చెక్‌ పెట్టేస్తారిలా!

పని ఒత్తిడి... ఎవరినైనా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అదే కొనసాగితే మానసిక కుంగుబాటుతోపాటూ అనారోగ్యాలు వచ్చి చేరతాయి. స్థాయితో సంబంధం లేకుండా అందరినీ వేధించే ఈ ఒత్తిడిని ఎదుర్కోవడం ఎలానో చెబుతున్నారీ ప్రముఖులు. మరి వాళ్లు పాటించే సూత్రాలేంటంటే...


వారంలో రెండుసార్లు యోగనిద్ర
- నరేంద్ర మోదీ

కొన్నాళ్లుగా యోగా నా దినచర్యలో భాగం అయిపోయింది. రోజూ ఎలాంటి ఆసనాలు వేసినా సరే... వారంలో రెండుసార్లు మాత్రం యోగనిద్రను తప్పనిసరిగా ప్రయత్నిస్తా. ఈ ఆసనంతో మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన లాంటివీ తగ్గుతాయి. దాంతోపాటు నా వెంట దాదాపుగా ఆక్యుప్రెషర్‌ రోలర్‌ కూడా ఉంటుంది. దీన్ని అప్పుడప్పుడూ ఉపయోగించడం వల్ల శరీరంలోని నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతుంది... శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఈ రెండూ సక్రమంగా ఉంటే ఇక ఒత్తిడికి అవకాశం ఎక్కడుంటుంది చెప్పండి!


వ్యాయామం ఉండాల్సిందే
- సత్య నాదెళ్ల

డుతూపాడుతూ పనిచేసుకుంటూ పోతే... ఒత్తిడి దరిచేరదనేది నా అభిప్రాయం. పనిలో అదే సూత్రాన్ని పాటిస్తుంటా. రోజూ పొద్దున్నే అరగంటసేపు వ్యాయామం చేయడం అలవాటుగా పెట్టుకున్నా. దానివల్ల నేను రోజంతా చురుగ్గా ఉండటంతోపాటూ ఉద్వేగాలూ అదుపులో ఉంటాయని నమ్ముతా.


అరగంట ధ్యానం
- ఆనంద్‌ మహీంద్ర

నలో చాలామంది ఏదో ఒక సందర్భంలో ఒత్తిడికి గురవడం మామూలే కానీ నేను దానికి లోనుకావడం నాకు ఇష్టంలేదు. అందుకే రోజూ పొద్దున్నే అరగంట ధ్యానం చేస్తా. అలా ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి సమస్యను తగ్గించుకోవడమే కాదు... నాకంటూ కొంత సమయం పెట్టుకున్నట్లుగానూ ఉంటుందనేది నా భావన. ఆ తరువాత ఎదురయ్యే సవాళ్లన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవచ్చని అనుకుంటా. అందుకే నా దినచర్యలో మొదటి ప్రాధాన్యం ధ్యానానికే ఇస్తా.


ఎక్కువగా పనిచేస్తా
- ఎలన్‌మస్క్‌

త్తిడి మన జీవితాన్నీ, లక్ష్యాలనూ పక్కదారి పట్టించకూడదని అనుకుంటా కానీ కొన్ని సందర్భాల్లో నేనూ దీనికి అతీతుడిని కాను. వారంలో వందగంటలకు పైగా కష్టపడుతున్నప్పుడు ఒత్తిడి ఎదురవడం మామూలే. ఆ సమయంలో ఇంకా ఎక్కువగా పనిచేస్తా. ఒకవేళ ప్రత్యేకంగా ఫలానా పనే నా ఒత్తిడికి కారణమని తెలిస్తే... దాన్ని అక్కడితో వదిలేయకుండా కష్టమైనా సరే పూర్తిచేసేలా చూసుకుంటా. అంతేతప్ప ఒత్తిడి కారణంగా ఉద్వేగానికి లోనుకావడం, ఇతరుల్ని బాధ్యుల్ని చేయడం, సానుభూతి పొందేందుకు ప్రయత్నించడం లాంటివి చేయను.


కారణాలు యోచిస్తా...
-జెఫ్‌ బెజోస్‌

నుల్లో ఎంత తీరిక లేకపోయినా సరే... ఒత్తిడి సంకేతాలు వెంటనే గుర్తిస్తా. నేను ఒత్తిడికి గురవుతున్నానని అనిపించినప్పుడు చేస్తున్న పనిని పక్కన పెట్టి దానికి కారణాలు యోచిస్తా.  ఆ వెంటనే దాన్ని పోగొట్టుకునేందుకు ఏం చేయాలనేది ఆలోచించి... చకచకా నిర్ణయాలు తీసుకుంటా. ఎవరికైనా ఫోను చేయడానికో, ఈమెయిల్‌ పంపడానికో సందేహిస్తూ ఒత్తిడికి లోనవుతున్నానని అనిపించినప్పుడు... ఫలితం ఆశించకుండా ఆ పని చేసేస్తా. నేను ఆశించిన ఫలితాలు రాకపోయినా సరే... పట్టించుకోను కానీ ఒత్తిడిని మాత్రం నా దరిచేరనివ్వను.


చక్కెరవ్యాధికి చెక్‌ పెట్టేద్దాం!

ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. మధుమేహం (డయాబెటిస్‌) విషయంలో ప్రకృతి వైద్యం ఇలాగే వ్యవహరిస్తుంది. జీవనశైలితో ముడిపడిన వ్యాధిని జీవనశైలిని మార్చుకోవటం ద్వారానే సరిదిద్దుకోవచ్చని సూచిస్తుంది. ఫిల్మ్‌సిటీలోని సుఖీభవ  వెల్‌నెస్‌ సెంటర్‌ మధుమేహ చికిత్సలో ఈ సూత్రాన్నే అనుసరిస్తోంది.

ధుమేహం జబ్బు కాదు. ఒక అవ్యవస్థ (డిజార్డర్‌). మన జీవనశైలితో గతి తప్పిన శరీర వ్యవస్థల ఫలితం. ‘కొందరికి జన్యువుల మూలంగా మధుమేహం రావొచ్చు గానీ చాలావరకిది మన జీవనశైలితో ముడిపడిందే. వంశపారంపర్యంగా వచ్చే మధుమేహాన్ని టైప్‌1 రకం అంటారు. ఇది చిన్న వయసులోనే వస్తుంది. పెద్దయ్యాక మొదలయ్యేది టైప్‌2 రకం. మధుమేహుల్లో ఎక్కువమంది ఇలాంటివారే. దీనికి మూలం అస్తవ్యస్తమైన మన ఆహార, విహారాలే’ అంటారు ‘సుఖీభవ’ నిర్వాహకురాలు డాక్టర్‌ అర్చన. ప్రస్తుతం అందరివీ ఉరుకుల పరుగుల జీవితాలే. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ అనుక్షణం పని ఒత్తిళ్లతో సతమతమయ్యేవారెందరో. ఏమాత్రం శారీరక శ్రమలేని పనులు పెరిగిపోవటం, వేళకు భోజనం చేయకపోవటం, కంటి నిండా నిద్రలేకపోవటం వంటివన్నీ శరీరం మీద విపరీత ప్రభావం చూపేవే. ఎప్పుడో అప్పుడంటే ఇబ్బందేమీ ఉండకపోవచ్చు దీర్ఘకాలంగా ఇలాంటి జీవనశైలి గలవారిలో గ్రంథుల వ్యవస్థ పనితీరు అస్తవ్యస్తమవుతుంది. మన కణాలన్నింటికీ శక్తి అవసరం. ఇది మనం తినే ఆహారంలోని గ్లూకోజు నుంచే లభిస్తుంది. దీన్ని కణాల్లోకి వెళ్లేలా చేసేది ఇన్సులిన్‌. కొందరిలో ఇన్సులిన్‌ తగినంతగా ఉత్పత్తి కాకపోవచ్చు. ఉత్పత్తి అయినా కణాలు ఇన్సులిన్‌కు స్పందించకపోవచ్చు. దీంతో గ్లూకోజు కణాల్లోకి వెళ్లదు. ఫలితంగా రక్తంలో గ్లూకోజు స్థాయులు అదేపనిగా పెరిగిపోతుంటాయి. ఇదే మధుమేహం. మధుమేహంతో పెద్ద చిక్కు- గుండెజబ్బులు, నాడులు దెబ్బతినటం, పాదాల మీద పుండ్లు పడటం, ఇన్‌ఫెక్షన్ల వంటి సమస్యలకు దారితీయటం. అందుకే దీన్ని నియంత్రణలో పెట్టుకోవటం ఎంతో అవసరం. ఇందుకు ప్రకృతి వైద్యం ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఆహారమే ఔషధం!
‘‘మధుమేహ చికిత్సలో జీవనశైలిని సరిదిద్దటం చాలా కీలకమైన విషయం. ఇందులో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే మధుమేహానికి ఆహారమే ఔషధం’’ అంటారు డాక్టర్‌ అర్చన. తమ సెంటర్‌లో ఇందుకోసం ప్రత్యేకమైన ఆహార పద్ధతులు రూపొందించామని చెబుతారు. ముఖ్యంగా ల్యాక్టోవెజిటేరియన్‌ డైట్‌ బాగా ఉపయోగపడుతుందంటారు. ఇందులో తాజా ఆకుకూరలు, పుల్లటి పండ్లు, చీజ్‌ వంటి పాల పదార్థాలతో కూడిన ఆహారం ఇస్తారు. అలాగే పొట్టుతీయని గోధుమ పిండితో చేసిన చపాతీలూ ఎంతో మేలు చేస్తాయి. ఆహార పద్ధతులనే కాదు.. ఉదయం నుంచీ రాత్రి వరకూ నీళ్లు తాగే విధానం, యోగా, ప్రాణాయామం, వ్యాయామం వంటి వాటినీ క్రమశిక్షణతో పాటించేలా సెంటర్‌లో తర్ఫీదు ఇస్తారు. రోజును ఉదయం పూట నీళ్లు తాగటంతో ఆరంభించటం మధుమేహులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ‘ఇది రక్తంలోని విషతుల్యాలు బయటకు వెళ్లిపోవటానికీ... గ్లూకోజు, రక్తపోటు నియంత్రణలో ఉండటానికీ దోహదం చేస్తుంది’ అంటారు డాక్టర్‌ అర్చన. నీళ్లు తాగిన తర్వాత బాదం, పిస్తా వంటి గింజపప్పులను తీసుకునేలా చూస్తారు. మధుమేహులకు ఆహారం విషయంలోనే కాదు.. శారీరక శ్రమ, వ్యాయామం మీదా శ్రద్ధ అవసరం. ఇవి కణాల్లోకి గ్లూకోజు సరిగా వెళ్లటానికి తోడ్పడతాయి. అందుకే ప్రకృతి వైద్యం యోగాసనాలకు చాలా ప్రాధాన్యమిస్తుంది. మధుమేహులకు అర్ధ మత్స్యేంద్రాసనం, పశ్చిమోత్తానాసనం బాగా ఉపయోగపడతాయి. ఇక ప్రాణాయామంలో కపాలభాతి చాలా మేలు చేస్తుంది. దీన్ని రోజుకు రెండు మూడు సార్లు చేయాల్సి ఉంటుంది. ‘సుఖీభవ’లో నిపుణులు వీటిని సాధన చేయిస్తారు. వీటితో పాటు నడక వంటి వ్యాయామాలూ చేయాల్సి ఉంటుంది.

డొక్క శుద్ధి!
గతి తప్పిన జీవనశైలి మూలంగా పొట్టలో విషతుల్యాలు పేరుకుపోతాయి. నిజానికి అన్ని జబ్బులకూ ఇదే మూలమన్నది ప్రకృతి వైద్యం సిద్ధాంతం. అందుకే మధుమేహులకు పొట్ట, పేగులు శుభ్రమయ్యేలా సెంటర్‌లో ప్రత్యేక చికిత్స చేస్తారు. ఇందుకు ఎనీమా బాగా ఉపయోగపడుతుంది. ‘‘ఆయా వ్యక్తుల అవసరాన్ని బట్టి త్రిఫల చూర్ణం, ఇతర ప్రత్యేకమైన మూలికలతో ఎనీమా ఇస్తుంటాం. దీంతో విషతుల్యాలు త్వరగా, బాగా బయటకు పోతాయి’’ అని డాక్టర్‌ అర్చన చెబుతారు. అంతేకాదు, తమ దగ్గర మధుమేహుల కోసం ప్రత్యేకంగా ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాల చికిత్స సదుపాయమూ ఉందంటున్నారు. ఈ కిరణాలు ఒంట్లోంచి విషతుల్యాలు బయటకు వెళ్లేలా తోడ్పడతాయి. ఇలా 10, 15 రోజుల పాటు చికిత్స, శిక్షణ తీసుకొని.. ఇంటికి వెళ్లిన తర్వాతా విడవకుండా పాటిస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పూర్తిగా మధుమేహాన్ని వెనక్కి మళ్లించలేకపోవచ్చు గానీ గ్లూకోజు స్థాయులను మాత్రం కచ్చితంగా తగ్గించుకోవచ్చు. దీంతో ఇన్సులిన్‌, మందుల మోతాదులనూ తగ్గించుకోవచ్చు. కేవలం చికిత్సగానే కాదు, మధుమేహ నివారణకూ ప్రకృతి వైద్యం ఉపయోగపడుతుంది. అంటే వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశం గలవారు త్వరగా దీని బారినపడకుండా కాపాడుకోవచ్చన్నమాట. కళ్ల నుంచి కాళ్ల వరకు.. మెదడు నుంచి మూత్ర పిండాల వరకూ అన్నింటినీ దెబ్బతీసే మధుమేహానికి తేలికైన, సరళమైన ప్రకృతి వైద్యం అందుబాటులో ఉండగా ఇక చింతించాల్సిన పనేముంది?

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు