జుంబాయే... ‘ఆగుంబా’యె..! - Sunday Magazine
close

జుంబాయే... ‘ఆగుంబా’యె..!

క్షణానికో రంగులోకి మారే ఆకాశమూ మబ్బుల సాగరంలో మునిగితేలే కొండలూ పాలనురుగుల్లాంటి జలపాతాలూ చిటపట చినుకులతో తడిసి ముద్దయ్యే పచ్చని చెట్లూ ఆ చెట్లమధ్యలో పరుగులు తీసే పేద్ద ఉడుతలూ కొమ్మలమీద కిచకిచలాడే కోతులూ... ఇలా ఎన్నో ప్రకృతి అందాలకీ అరుదైన జీవజాతులకీ ఆలవాలమైన అద్భుత ప్రదేశమే ‘ఆగుంబె’... దక్షిణ భారత చిరపుంజి..!

దేశంలోకెల్లా అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం గతంలో చిరపుంజి ఇప్పుడు మాసిన్రమ్‌ అనేది తెలిసిందే. దాని తరవాత అధిక వర్షం కురిసేది కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా తీర్థహళ్ళి తాలూకాలో ఉన్న ‘ఆగుంబె’లోనే. అందుకే దీన్ని దక్షిణాది చిరపుంజి అంటారు. ఇక్కడ సగటు వర్షపాతం 7,600 మిల్లీమీటర్లు.

భారతావనికే పచ్చతోరణం కట్టినట్లుండే పడమటి కనుమల్లో ముదురాకుపచ్చ చీర కట్టుకున్న ముద్దుగుమ్మలా కనిపిస్తుందీ కొండ ప్రాంతం. ఎగుడుదిగుడు కొండలమీద చిక్కగా పరచుకున్న ఆగుంబె ఊళ్లోకి అడుగుపెడితే... పచ్చిఆకులూ చినుకు తడికి చిత్తడిగా మారిన మట్టీ కలగలసిన పరిమళం గుండెల నిండా పరుచుకుంటుంది. ఎటు చూసినా పచ్చని చెట్లూ వాటి మధ్యలో ముచ్చటగా కుదురుకున్న పెంకుటిళ్లూ... ఆ పక్కకే చిగురుపచ్చదనం నింపుకున్న వరి పొలాలతో ఏ చిత్రకారుడి ఊహల్లో నుంచో జారిపడిన కుంచె చిత్రంలా ఉంటుందా కొండ గ్రామం.

అప్పటివరకూ తెల్లగా ఉన్న ఆకాశంలోకి ఉన్నట్టుండి వర్ష మేఘాలు కమ్ముకొస్తుంటాయి. దాంతో పచ్చని కొండలన్నీ నలుపూ తెలుపూ కలగలిసిన బూడిదవర్ణంలోని మబ్బులసాగరంలో మునిగితేలుతున్నట్లే ఉంటుంది. ఆ మబ్బుతెరలు వీడిపోగానే ఆకాశం సప్తవర్ణశోభితమై మైమరపిస్తుంటుంది. ఆ సమయంలో అక్కడున్న సన్‌సెట్‌ పాయింట్‌ దగ్గరకు వెళితే, రుధిర వర్ణంలో మెరిసిపోతున్న భానుడు సుదూరంగా ఉన్న అరేబియా సముద్రపు ఒడిలోకి జారిపోతున్న దృశ్యాన్ని కళ్లతో చూడాల్సిందే. ఆ అందాల్ని చూసేందుకు ఎంతోమంది కష్టాలకోర్చి మరీ ఆ అడవికి చేరుకుని, ప్రకృతి గీసిన ఆగుంబె చిత్రాన్ని చూస్తూ పచ్చరంగులో ఎన్ని ఛాయలో అని విస్తుపోతుంటారు.

జలపాత జావళి!

అసలైన ఆగుంబె అందం అరణ్యంలోకి వెళ్లినప్పుడే తెలుస్తుంది. చెట్లమధ్యలో వర్షం నీళ్లతో నిండిన ఆకుపచ్చని కొలనులూ వాటి చుట్టూ సిమెంటుగోడ కట్టినట్లుగా నేలమీద పరచుకున్న లావుపాటి వేళ్లూ వాటిమీద పెరిగిన రంగుల పుట్టగొడుగులూ ఆ వేళ్ల సందుల్నే గూళ్లుగా మలుచుకున్న రంగుల కీటకాలూ కప్పలూ సీతాకోకచిలుకలూ... ‘వావ్‌... పుస్తకాల్లో చదువుకున్న వర్షారణ్య జీవావరణం అంటే ఇదేనా’ అనిపించకమానదు. ఆ అనుభవాన్ని గుండెల నిండా నింపుకుని ఆగుంబెకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగి గుండి జలపాతం దగ్గరకు వెళితే కళ్లు తిప్పుకోవడం కష్టం. అక్కడ నుంచి మరో మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే - సీతానది 850అడుగుల ఎత్తునుంచి కిందకి జాలువారుతూ కనిపిస్తుంది. దీన్నే బర్కానా జలపాతం అంటారు. బర్కా అంటే ఆ ప్రాంతంలో ఉన్న మౌస్‌ డీర్‌ అని అర్థమట. అక్కడ అవి ఎక్కువగా ఉండటంతో ఈ జలపాతానికి ఆ పేరు వచ్చింది. ఈ దారిలో వెదురుపొదలూ ఇతరత్రా ఔషధ మొక్కలూ అనేకం కనిపిస్తాయి. గురూజీ అనే ఓ రకం మొక్కకి ఈ కొండలు పెట్టింది పేరు. ఇది అరుదుగా ఏడేళ్లకోసారి పూస్తుందట. అది పూసిందీ అంటే ఆ ఏడాది కరవు పొంచి ఉందని నమ్ముతారు స్థానికులు.

ఆగుంబె గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూడ్లు తీర్థ జలపాతాన్నీ అక్కడి నుంచి మరికాస్త పైకి వెళ్లాక వచ్చే ఒనకే(దంపుడు కర్ర)అబ్బి జలపాత అందాల్నీ చూసి తీరాల్సిందే. వారాహి నదికి జన్మనిస్తూ 1493 అడుగుల నుంచి జారిపడే కుంచికల్‌ జలపాతాన్ని చూస్తుంటే కాళ్లు అక్కడి నుంచి కదలనని మొరాయిస్తాయి. వీటితోపాటు అక్కడ ఉన్న 14వ శతాబ్దం నాటి గోపాలకృష్ణ ఆలయాన్నీ ఆనాటి మాలెనాడు సంప్రదాయాన్ని ప్రతిబింబించే పాత ఇళ్లనీ చూడొచ్చు. అలాగే అడవిగుండా ప్రయాణించి నిషానిగడ్డకి చేరుకోవడం మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది.

తరగని అందాలకీ చెదరని ప్రశాంతతకీ నిలయమైన ఈ పచ్చని కొండలు రాచ నాగుల ఆవాసం కూడా. అందుకే ఆగుంబెకి కింగ్‌ కోబ్రా క్యాపిటల్‌ అని పేరు.

ప్రపంచంలోనే ఎక్కువగా కింగ్‌ కోబ్రాలున్న ఈ ప్రాంతాన్ని గుర్తించి, వాటిని సంరక్షించే ఏకైక ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దేందుకు 2005లో వర్షారణ్య పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పాడు సుప్రసిద్ధ సర్ప పరిశోధకుడు రొములస్‌ విటేకర్‌. పిట్‌ వైపర్లూ ర్యాట్‌ స్నేక్‌లూ పసరిక పాములూ నీలిరంగు కప్పలూ అరిచే జింకలూ సింహంతోక ఉన్న మకాకే కోతులూ పసుపు రంగు బుల్‌బుల్‌ పిట్టలూ మలబార్‌ ట్రోగన్‌ పక్షులూ... ఇలా ఈ ప్రాంతం మరెన్నో అరుదైన జీవజాతుల ఆవరణం. అందుకే అక్కడ ఉన్న అపారవృక్ష-జంతు వైవిధ్యం అంతరించిపోకుండా స్థానికులకి అవగాహన కలిగిస్తుందీ కేంద్రం. ఔషధ మొక్కల సంరక్షణా కేంద్రం కూడా ఉందిక్కడ. ఇక్కడున్న 371 జాతుల్లో182 మొక్కలను ఓషధీ విలువలున్నవిగా గుర్తించారు. కింగ్‌ కోబ్రాల్ని దగ్గరగా చూడాలనుకునే పర్యటకులు మాత్రం స్థానిక గైడ్‌ సాయంతో వాటి ఆవాసాల దగ్గరకు వెళుతుంటారు. ‘అమ్మో భయం’ అనుకునేవాళ్లు ప్రకృతి ఒడిలోని ఆగుంబెలో సాంత్వన పొంది వెనుతిరుగుతారు.

ఎలా వెళ్లాలి?

విమానంలో ఆగుంబెకి చేరుకోవాలంటే సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళూరులో దిగాలి. రోడ్డు మార్గంలో వెళ్లాలనుకుంటే బెంగళూరు నుంచి వెళ్లేవాళ్లు తుమకూరుకి చేరుకుని అక్కడి నుంచి వెళ్లవచ్చు. అక్కడి నుంచి బస్సుల్లోగానీ క్యాబ్‌ల్లోగానీ సులభంగా ఈ వర్షారణ్య ప్రాంతానికి చేరుకోవచ్చు. ఉండటానికి హోమ్‌ స్టేలతోపాటు ప్రైవేటు రిసార్ట్‌లూ ఉన్నాయి. కాబట్టి మంగళూరు రుచుల్ని ఆస్వాదిస్తూ ఆగుంబె అందాల్ని ఆసాంతం చూడొచ్చు.


ఇది... ‘స్వామి’ ఇల్లు!

ఆర్‌.కె.నారాయణ్‌ మాల్గుడీ డేస్‌ కథల్లోని ఊరు కల్పితం కావచ్చుగాక, కానీ దాన్ని బుల్లితెరకెక్కించి, ఎందరినో ఆ ఊళ్లోకీ స్వామి ఇంటికీ తీసుకెళ్లిన శంకరనాగ్‌ మాల్గుడీ మాత్రం ఆగుంబెనే. అవునండీ, అందులోని స్వామి ఇల్లు ఈ ఊళ్లోనే ఉంది. దొడ్డమానె(పెద్ద ఇల్లు)గా పిలిచే ఇక్కడి మండువా ఇంటిలోనే ఆ సీరియల్‌ తీశారట. వక్క, వరి పొలాల్ని సాగుచేసే మోతుబరి రైతు వాసుదేవరావు 1860లలో చెక్క స్తంభాలూ రాళ్లతో మూడంతస్తుల ఇల్లు కట్టించారు. తరవాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య అక్కడకు వచ్చినప్పుడు- 15 గదులతో పైనున్న మూడో అంతస్తుని తీసేయమనీ లేదంటే పునాది దెబ్బతింటుందనీ చెప్పారట. దాంతో ప్రస్తుతం రెండంతస్తులుగా ఉన్న ఆ ఇంట్లో 28 గదులూ ఏడు వరండాలూ రెండు వంటిళ్లూ 20 మంది కూర్చునే డైనింగ్‌ హాలూ ఉన్నాయట. వరండాల్లో ఒకేసారి వందమంది కూర్చుని భోజనం చేయొచ్చు. ప్రధాని నెహ్రూ ఈ ఇంటిని రెండుసార్లు సందర్శించారట. ఆనాటి మైసూర్‌ దీవాన్‌తో సహా ఎందరికో ఆతిథ్యమిచ్చిన ఈ ఇల్లు, సందర్శకుల్నీ ఆప్యాయంగా ఆహ్వానిస్తోంది. ‘ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టకుండా పంపించకూడదని మా పెద్దలు చెప్పారు. ఆ రోజుల్లో ఎవరొచ్చినా అలాగే మర్యాద చేసేవారు. కాలక్రమంలో ఇక్కడకు వచ్చే పర్యటకుల సంఖ్య పెరిగింది. అయినా మేం దీన్ని వ్యాపారంగా మార్చుకోలేదు. వాళ్లకిష్టమై ఇచ్చినది తీసుకుంటాం. అదీ ఇంటి నిర్వహణకీ ఊళ్లోని పేద పిల్లల తిండికీ చదువుకే వాడతాం’ అంటారు ఆ ఇంటి యజమాని కస్తూరి. సేంద్రియ పద్ధతుల్లో పండించినవాటితో వండినవే అక్కడ కొసరికొసరి వడ్డిస్తారట. అందుకే ఆ ఇంటికి వెళ్లినవాళ్లు ఆ ఆత్మీయవిందుని ఎప్పటికీ మరిచిపోలేమని చెబుతుంటారు. ఎంతైనా అది దొడ్డ మనసున్న దొడ్డమానె!

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న