పాతిక గ్రామాలకు ఆ జ్యోతి కనిపిస్తుంది! - Sunday Magazine
close

పాతిక గ్రామాలకు ఆ జ్యోతి కనిపిస్తుంది!

శివకేశవులు ఒకేచోట కొలువుదీరిన అరుదైన ఆలయాల్లో సోమేశ్వరాలయం ఒకటి. ఈ క్షేత్రంలో శివుడు సోమేశ్వరుడిగా, నారాయణుడు లక్ష్మీనరసింహస్వామిగా దర్శనమిస్తూ భక్తుల పూజల్ని అందుకోవడం విశేషం. సర్వ శుభాలనూ కలిగించే ఈ క్షేత్రంలో ఏడాదికోసారి వెలిగించే జ్యోతి... చుట్టుపక్కల పాతిక గ్రామాలకు కనపడటాన్ని ఓ విశేషంగా చెప్పుకుంటారు.

చుట్టూ పచ్చని వాతావరణం... ఆ మధ్యలో ఎత్తైన కొండపైన రెండు గుహల్లో స్వయంభువులుగా వెలసిన హరిహరుల క్షేత్రమే జనగామ జిల్లా పాలకుర్తిలో కనిపించే సోమేశ్వరాలయం. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలోని శివకేశవులను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. కార్తిక పౌర్ణమి రోజున ఇక్కడ వెలిగించే జ్యోతి చుట్టుపక్కల పాతిక గ్రామాలకు కనిపిస్తుందనీ... ఇది శబరిమల, అరుణాచలం తరువాత దక్షిణభారత దేశంలోనే మూడో అతి పెద్ద జ్యోతి అనీ అంటారు. ఈ కొండపైన రాత్రుళ్లు హరిహరులు సంచరిస్తుంటారనీ ప్రతీతి.

స్థలపురాణం

పురాణాల ప్రకారం శివుడి అనుగ్రహం కోసం సప్తరుషులు తపస్సు చేశారట. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవ్వడంతో నారాయణుడితో కలిసి ఈ ప్రాంతంలో కొలువుదీరమంటూ ఆ రుషులు వేడుకున్నారట. అలా శివకేశవులు ఈ కొండపైన రెండు గుహల్లో స్వయంభువులుగా వెలిశారని చెబుతారు. ఆ తరువాత కొన్నాళ్లకు శివ భక్తురాలైన ఓ వృద్ధురాలు రోజూ ఈ గుడికి వచ్చి కొండపైకి వెళ్లలేక కింద నుంచే కొండచుట్టూ ప్రదక్షిణ చేసి వెనక్కి వెళ్లిపోయేదట. ఆమె భక్తికి మెచ్చిన సోమేశ్వరుడు ఆలయం దగ్గరున్న కొండను రెండుగా చీల్చడంతో సులువుగా ప్రదక్షిణ చేసుకోవడం మొదలుపెట్టిందట. అప్పటినుంచీ ఇక్కడకు వచ్చే భక్తులు ఈ మార్గంలో వెళ్లి కొండపైనున్న ఉపాలయాన్ని దర్శించుకుంటారు. అయితే చాలా సన్నగా ఉండే ఈ కొండమార్గంలో భక్తిభావంతో వస్తే ఎంతటి స్థూలకాయులైనా పడతారనీ, అపనమ్మకంతో వచ్చేవారిని ఇక్కడున్న తేనెటీగలు తరుముతాయనీ చెబుతారు. ఈ ప్రాంతంలోనే కవి పాల్కురికి సోమనాథుడు జన్మించాడనీ.. ఆలయం కొండ కిందే ఆ కవి సమాధి కట్టారనీ అంటారు. పాలకుర్తికి రెండు కిలోమీటర్ల దూరంలోని బమ్మెర గ్రామంలో భాగవత గ్రంథకర్త బమ్మెర పోతన నివసించినట్లుగా చెబుతారు.

ముడుపుల చెల్లింపు

ఇక్కడకు వచ్చే భక్తులు మొదట సోమేశ్వరుడినీ, ఆ తరువాత లక్ష్మీనరసింహస్వామినీ దర్శించుకుంటారు. సంతానంలేనివారు ఈ ఆలయంలో కొబ్బరికాయల్ని ముడుపుగా కడితే పిల్లలు కలుగుతారని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు, మహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ఏటా కార్తిక పౌర్ణమి సందర్భంగా ఈ కొండపైన సుమారు నలభై అడుగుల ఎత్తులో జ్యోతిని వెలిగించే వేడుకను చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఇక, ఈ కొండ కింద కోనేరు, దత్తాత్రేయుడు, ఓంకారేశ్వరుడు, రమా సహిత సత్యనారాయణుడు, వాసవి కన్యకాపరమేశ్వరి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి అయిదు కిలోమీటర్ల దూరంలో వల్మిడి అనే ప్రాంతంలో సీతారామచంద్రులు కాలుమోపారనీ, రాముడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడనీ, లవకుశులు ఈ ప్రాంతంలోనే జన్మించారనీ అంటారు. సోమేశ్వరాలయానికి వచ్చే భక్తులు ఇక్కడున్న మునులగుట్ట, రాములగుట్ట, వల్మిడిని చూసేందుకు ఆసక్తి చూపిస్తారు.

ఎలా చేరుకోవచ్చు

హైదరాబాద్‌ వరంగల్‌ దారిలో స్టేషన్‌ఘన్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ వస్తుంది. రైల్లో వచ్చే భక్తులు అక్కడి నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో వెళ్తే పాలకుర్తికి చేరుకోవచ్చు. లేదంటే వరంగల్‌ వరకూ వస్తే పాలకుర్తికి నేరుగా బస్సులు కూడా ఉంటాయి.

- పున్న శ్రీనివాసులు, ఈనాడు, వరంగల్‌

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న